"బాలీవుడ్, క్రికెట్‌కు భారతీయుల్లో ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకుందాం... వాళ్లకు కావాల్సిన సమాచారం అందిస్తూ సెర్చ్ మార్కెట్లో ఎదుగుదాం "... ఒకప్పటి గూగుల్ వ్యాపార ప్రణాళిక ఇది. ఈ ప్లాన్ అమలు చేసేందుకు హైదరాబాద్‌నే వేదికగా ఎంచుకుంది. భారత్‌లో మొట్టమొదటి బిజినెస్ సెంటర్‌ను భాగ్యనగరంలోనే ఏర్పాటు చేసింది.
16 ఏళ్లు గడిచాయి. సెర్చ్ ఇంజిన్లలో రారాజుగా నిలిస్తే చాలనుకున్న గూగుల్... ఇప్పుడు సరికొత్త సాంకేతికతల అభివృద్ధిలో దూసుకెళ్తోంది. సామాన్యులు అంతర్జాలాన్ని వాడే విధానాన్నే సమూలంగా మార్చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో గూగుల్ భాగమైపోయింది.
- అంతర్జాల శోధనలో 86 శాతం వాటా గూగుల్ సొంతం. యాహూ, ఆల్ట్ విస్తా సెర్చ్ ఇంజిన్లు దాదాపుగా మరుగునపడిపోయాయి.
- గూగుల్ మ్యాప్స్ అత్యవసరమైన సాంకేతికతగా మారింది.
- జీమెయిల్ రాకతో హాట్‌మెయిల్, యాహూ మెయిల్స్ వంటి దిగ్గజ సర్వీసులు కనుమరుగయ్యాయి.
- గూగుల్ ఆధ్వర్యంలో ఉన్న యూట్యూబ్.. ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో సైట్‌గా మారింది.
- గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మూడింట నాలుగో వంతు వాటా కైవసం చేసుకుంది.
1998లో జననం
సాంకేతిక దిగ్గజంగా పేరొందిన ఈ గూగుల్‌ను 1998లో లారీ పేజ్, సర్గే బ్రిన్ అనే వ్యక్తులు కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించారు. ఆరేళ్ల తర్వాత భారత్‌లో తొలి సంస్థను నెలకొల్పారు.
భారత్‌లో తన తొలి కార్యాలయం ప్రారంభించిన పదహారేళ్ల తర్వాత అత్యంత అధునాతనమైన సాంకేతికతలను ప్రస్తుతం దేశంలో అభివృద్ధి చేస్తున్నారు. వీటిని ప్రపంచమంతటికీ ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు.
చెల్లింపుల్లో సంస్కరణ- గూగుల్ పే!
2018 సంవత్సరంలో డిజిటల్ చెల్లింపుల సాంకేతికత అభివృద్ధిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం సాధించింది. అంతకుముందే భారత్‌లో గూగుల్ డిజిటల్ పేమెంట్ యాప్ 'గూగుల్ టెజ్'ను ప్రారంభించింది. అనంతరం పేరు మార్చి 'గూగుల్ పే'గా నామకరణం చేసింది. చెల్లింపులను డిజిటలైజ్ చేయడంలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, తద్వారా ప్రపంచస్థాయి ఉత్పత్తులు తయారు చేయడానికి సహాయపడుతోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవలే పేర్కొన్నారు.
"వేగంగా, సులభంగా, కాంటాక్ట్ లెస్ పేమెంట్‌కు గూగుల్ పే ఉదాహరణ. భీమ్ యూపీఐ అనుసంధానంతో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. గూగుల్ పేతో రిక్షావాలాల నుంచి కుటుంబసభ్యుల వరకు డబ్బులు పంపించుకోవడం సులభమవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను అంగీకరించడానికి సిద్ధమయ్యారు. ఎక్కువ భాగం చిన్న వ్యాపారాలు ఆర్థిక వ్యవస్థలో భాగం కావడానికి ఇది వీలు కల్పించింది. "
-సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
అంతా ఆన్లైన్ మయం
చిన్న వ్యాపారులు సైతం సాంకేతికతను వేగంగా స్వీకరించడం గూగుల్‌ను ఆశ్చర్యపరిచింది. ఈ కారణంగానే త్వరితగతిన మార్పులన్నీ సంభవిస్తున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం దేశంలోని చిన్న వ్యాపారుల్లో మూడింట ఒక వంతు మాత్రమే సాంకేతికతను వినియోగించారు. ప్రస్తుతం 2.6 కోట్ల చిన్న వ్యాపారాలు ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. గూగుల్ శోధన, గూగుల్ మ్యాప్స్లలో వీటి సమాచారం అందుబాటులో ఉంటోంది. ఇది ప్రతి నెల 15 కోట్ల మంది వినియోగదారులను వ్యాపారులతో అనుసంధానం చేస్తోంది.
మన కోసమే 'బోలో'
ప్రపంచ అవసరాల కోసం భారత్‌లో బోలో అనే రీడింగ్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది గూగుల్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం ఉన్న బోలో యాప్‌ను నిజానికి భారత్ కోసమే తయారు చేశామని సుందర్ పిచాయ్ తెలిపారు. ఇప్పుడు ఈ సాంకేతికత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు కూడా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యాప్‌ను 'రీడ్ అలాంగ్'గా పేర్కొంటున్నారు.
"ఈ సాంకేతికతకు చాలా మంచి స్పందన వచ్చింది. దీనిని ప్రపంచం అంతటికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పుడు 180 దేశాల్లోని చిన్నారులు తొమ్మిది భాషల్లో చదవడం నేర్చుకోవచ్చు. భారత్‌లోని ఆవిష్కరణలు ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే."
-సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
మరో డిజిటల్ విప్లవం కోసం...
సాధారణ వ్యాపార ప్రణాళికతో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి, అనూహ్య విజయాలు సాధించిన గూగుల్... ఇప్పుడు మరో డిజిటల్ విప్లవమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసింది. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు వచ్చే 5-7 ఏళ్లలో 75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విషయం మంగళవారం ప్రకటించారు.
ఈ 75 వేల కోట్ల పెట్టుబడులను దేశంలో... ఈక్విటీ, భాగస్వామ్యాలు, మౌలిక వసతులు వంటి విభాగాల్లో పెట్టుబడులుగా పెట్టనున్నట్లు వివరించారు పిచాయ్. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై తమకు ఉన్న నమ్మకానికి ఈ పెట్టుబడులు ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ రూ.75వేల కోట్లతో చేపట్టే ప్రాజెక్టులు పూర్తిగా దేశీయ అవసరాలకు తగినట్లు ఉంటాయని స్పష్టం చేశారు పిచాయ్. అవి...
- ప్రతి భారతీయుడికి తమ సొంత భాషలో తగిన సమాచారం అందించడం
- భారతదేశ ప్రత్యేక అవసరాలకు సరిపోయే కొత్త వస్తుసేవలు అభివృద్ధి చేయడం
- డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం భారత్‌లోని వ్యాపారాలకు సహాయం చేయడం
- సమాజ వికాసానికి తోడ్పడే ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో కృత్రిమ మేధను ఉపయోగించడం
ఇదీ చదవండి- డిజిటల్ ఇండియా కోసం గూగుల్ రూ.75వేల కోట్ల నిధి
ఎదురుచూపులు లేవిక!
ఈ సందర్భంగా తన చిన్నతనంలోని అనుభవాలను గుర్తు చేసుకున్నారు పిచాయ్.
"నేను యువకుడిగా ఉన్నప్పుడు ప్రతి సాంకేతికత నేర్చుకోవడానికి కొత్త అవకాశాలను తీసుకొచ్చింది. కానీ ఈ సాంకేతికత నాకు(భారత్‌లో) అందుబాటులోకి వచ్చేసరికి వేచిచూడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం భారత్‌లోని ప్రజలు సాంకేతికత కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. కొత్త తరం సాంకేతికతలు అన్నీ భారత్‌లోనే తొలిసారి అందుబాటులోకి వస్తున్నాయి."
-సుందర్ పిచాయ్
(రచయిత- కృష్ణానంద్ త్రిపాఠీ)