చాలామంది తమ రోజువారీ సౌందర్య పోషణలో భాగంగా వివిధ నూనెలు ఉపయోగించడం సాధారణమే. నూనె వల్ల శరీరానికి తేమ అందడంతో పాటు.. అందులోని పోషకాల వల్ల చర్మానికి నిగారింపు లభిస్తుందని అందరికీ తెలిసిందే. నూనెను తమ సౌందర్య పోషణలో ఒక భాగంగా మాత్రమే ఉపయోగిస్తుంటారు అతివలు. కానీ కేవలం నూనె ఉత్పత్తులతోనే ప్రపంచ అందగత్తెల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు ‘బెల్జియం భామలు’. కేవలం కురులకు మాత్రమే కాదు.. ముఖంపై మచ్చలను తొలగించుకోవడానికి.. చర్మానికి నిగారింపు చేకూరడానికి.. పాదాల ఆరోగ్యానికి.. ఇలా నఖశిఖపర్యంతం సౌందర్య పోషణకు నూనెనే ప్రధాన సాధనంగా వినియోగిస్తున్నారు వీరు. కేవలం నూనెతో ఇంతటి అందం సాధ్యమా అని విన్నవారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..! కానీ ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా నిరూపిస్తున్నారు బెల్జియం మగువలు. మరి, ప్రపంచమే నివ్వెరపోయేలా చేస్తోన్న వారి అందం వెనకున్న ఆ బ్యూటీ ఆయిల్స్ ఏంటో మనమూ తెలుసుకుందామా?
అపురూప సౌందర్యానికి ‘మింక్ నూనె’!
కాలుష్యం వల్ల అటు చర్మ సమస్యలతో పాటు.. ఇటు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా మారడం.. దుమ్ము వల్ల చుండ్రు ఏర్పడడం.. కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలడం.. లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు నేటి యువత. ఈ సమస్యలన్నింటికీ మింక్ నూనెతో చెక్ పెట్టచ్చని చెప్తున్నారు బెల్జియం గర్ల్స్. ఈ నూనెను చర్మానికి ఉపయోగించడం వల్ల వయసు పైబడిన ఛాయలు, మచ్చలు వంటి వాటిని నివారించవచ్చు. అంతేకాదు.. మేకప్‌కి ముందు దీన్ని ఫౌండేషన్‌తో కలిపి లేదా మాయిశ్చరైజర్‌గా వాడడం వల్ల మేకప్‌లోని రసాయనాల వల్ల చర్మం పాడవకుండా కాపాడుతుందీ నూనె. అలాగే స్నానమాచరించే నీటిలో ఈ నూనెను కొన్ని చుక్కలు కలుపుకొని స్నానం చేయడం వల్ల చర్మానికి లోపలి నుండి పోషణ లభించి నిర్జీవంగా మారకుండా ఉంటుంది. దీనితోపాటు.. జుట్టు సమస్యలతో బాధపడేవారు దీనిని మాడుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల మంచి రిలాక్సేషన్ లభించడంతో పాటు.. కుదుళ్లకు బలం చేకూరి అనతికాలంలో జుట్టు రాలడం తగ్గుతుంది. ‘టీట్రీ నూనె’తో మచ్చలు మాయం..
చర్మ పొడిబారడం వల్ల పొక్కులు రావడం, పింపుల్స్.. వంటి సౌందర్య సమస్యలు తలెత్తుతాయి. కొందరు వాటిని గిల్లడం వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి మచ్చలకు సహజసిద్ధమైన మందులా పనిచేస్తుంది టీట్రీ నూనె. ఈ విషయాన్ని తమ స్వానుభవంతో ప్రపంచానికి చాటుతున్నారు బెల్జియం అందాల తారలు. అందుకోసం ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు లేదా స్నానమాచరించడానికి గంట ముందు శరీరానికి టీట్రీ నూనెను పూతలా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల నూనె చర్మంలోకి బాగా ఇంకి మచ్చలపై తన ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు.. క్రమంగా చర్మం పొడిబారడం తగ్గి నిగారింపు సంతరించుకుంటుంది. అంతేకాదు.. ఈ నూనెతో స్ట్రెచ్‌మార్క్స్‌ని కూడా దూరం చేసుకోవచ్చు.కళ్లకు ‘బాదం నూనె’తో సాంత్వన..!
ఇటు ఇంటి పనులు, అటు ఆఫీసు పనులతో ఆడవారికి తీరికే దొరకదు. క్రమంగా అది నిద్రలేమికి దారితీస్తుంది. దాని వల్ల కళ్లు ఉబ్బినట్లవడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. వాటిని తొలగించడానికి ఎన్ని ఖరీదైన క్రీములు వాడినా.. అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. అందుకే ఇటువంటి కళ్ల సమస్యల నుండి ఉపశమనం పొందడానికి బాదం నూనెను మించింది లేదంటున్నారు బెల్జియం బ్యూటీస్. కళ్లు అలసినట్లు అనిపించినా.. దురద పెడుతున్నట్లుగా ఉన్నా.. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను దూదిపై వేసుకొని దాంతో కళ్ల చుట్టూ రాసుకుని నిద్రకు ఉపక్రమించాలి. అలా రోజూ చేయడం వల్ల కొద్ది రోజుల వ్యవధిలోనే అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ నూనెలోని రెటినాల్, విటమిన్-ఇ, విటమిన్-కె.. వంటి పోషకాలు కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలను తగ్గించడంతో పాటు.. మంట, దురద వంటి వాటిని కూడా దూరం చేస్తాయి.‘ఆలివ్ నూనె’తో పాదాలు పదిలం..
ముఖానికి, శరీరానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ పాదాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తాం. ముఖం, చేతులు ఎంతో అందంగా మెరుస్తూ.. పాదాలు మాత్రం అందవిహీనంగా ఉండే ఏం బాగుంటుంది. మరి మీ పాదాలు కూడా నిగారింపు సంతరించుకోవాలంటే ఆలివ్ నూనెను మీ బ్యూటీ సాధనాల్లో చేర్చుకోవాల్సిందే అంటున్నారు బెల్జియం అతివలు. అందుకోసం గోరువెచ్చటి ఆలివ్ నూనెలో పాదాలను కాసేపు ఉంచి.. ఆపై ఉప్పుతో స్క్రబ్ చేసుకుని, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల పొడిబారిన పాదాలకు మాయిశ్చరైజర్ అందడంతో పాటు మురికిని తొలగించుకోవచ్చు. ఈ పద్ధతిని తరచూ పాటించడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. అలాగే పాదాలూ మృదువుగా మారతాయి.‘తేనె’తో ట్యాన్‌కు చెక్!
అటు ఆరోగ్యపరంగానైనా, ఇటు అందం పరంగానైనా తేనె అందించే ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తేనె శరీరానికి మాయిశ్చరైజర్‌ని అందించడంతోపాటు.. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా కాపాడుతుందని చెప్తున్నారు బెల్జియం ముద్దుగుమ్మలు. అందుకోసం తేనెను శరీరంపై పూతలా రాసుకుని ఓ అరగంటపాటు అలా ఉంచి.. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇందులోని యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ-ఆక్సిడెంట్లు చర్మంపై ఏర్పడిన అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా చర్మానికి లోపలి నుండి పోషణ అందించి పొడిబారకుండా కాపాడుతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు తగ్గి బిగుతుగా మారడం వల్ల వయసు పైబడిన ఛాయలను నివారించవచ్చు.చూశారుగా.. సహజసిద్ధంగా లభించే నూనెలతో ఎంతటి అపురూప సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చో..! మరి మీరు వీటిని మీ బ్యూటీ కిట్‌లో చేర్చుకొని న్యాచురల్ బ్యూటీస్‌గా వెలిగిపోండి..
గమనిక: కృష్ణ వర్ణంతో.. నిగనిగలాడే సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్ క్యూబా బ్యూటీస్. ఎన్ని ఆధునిక పద్ధతులు వచ్చినా.. పూర్వీకుల సౌందర్య చిట్కాలను పాటిస్తూ బ్యాక్ బ్యూటీస్‌గా వెలుగొందుతున్నారీ దేశపు మగువలు. మరి, వారి సౌందర్యం వెనక గల బామ్మల కాలం నాటి సౌందర్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే www.vasundhara.net లో మార్చి 4 న ‘విదేశీ సౌందర్యం’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక కథనాన్ని చదవండి.
ఇదీ చదవండి: 'ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గుంతకల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి'