గుండె లయ నియంత్రణలో లేని ఇద్దరు రోగుల సమస్యను ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు కొత్త సాంకేతికతతో పరిష్కరించారు. దక్షిణాదిలోనే ఇలాంటి చికిత్స అందించడం తొలిసారి అని ఆసుపత్రి హెచ్‌వోడీ, ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ సి.నరసింహన్ తెలిపారు.
‘ఆరోగ్యవంతుల గుండె నిమిషానికి 72-84 సార్లు కొట్టుకుంటుంది. దీన్నే ‘లయ’గా వ్యవహరిస్తారు. గుండె కండరాల్లో ఏర్పడిన లోపాలు, వైఫల్యాల కారణంగా కొందరిలో హృదయం వేగంగా, మరికొందరిలో నెమ్మదిగా కొట్టుకుంటుంది. నెమ్మదించిన పక్షంలో పేస్‌మేకర్ సాయంతో బయట నుంచి విద్యుత్తు ప్రేరణలు అందించి వేగాన్ని పెంచుతారు. గుండె వేగం ఎక్కువ ఉంటే ప్రస్తుతం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (ఆర్‌ఎఫ్‌ఏ) సాంకేతికతతో చికిత్సలు అందిస్తున్నారు. మేము ‘కూలింగ్ బెలూన్’ అనే కొత్త విధానంతో ఇద్దరు రోగులకు విజయవంతంగా చికిత్స అందించాం’ అని డాక్టర్ నరసింహన్ తెలిపారు.
చికిత్స ఇలా..
తొలుత కాలి నరం నుంచి క్యాథటార్‌ను ఎడమ దమని వరకు పంపి గుండె 3డీ ఇమేజ్‌ను రూపొందిస్తారు. లయ దెబ్బతినడానికి కారణమైన కండరాలను గుర్తిస్తారు. అక్కడ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సృష్టించడం ద్వారా సంబంధిత కండరాల నుంచి విద్యుత్తు ప్రేరణలు ముందుకు వెళ్లకుండా చేస్తారు. ‘ఫలితంగా గుండె లయ నియంత్రణలోకి వస్తుంది. ఈ విధానంలో మళ్లీ ఆ తరహా సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు చాలా తక్కువ’ అని డాక్టర్ నరసింహన్ వెల్లడించారు.
- ఇదీ చదవండి :