‘రోడ్లపై నడిచే వాహనాలకు బిగించే నంబరు ప్లేట్లు(Number plates) రంగురంగులుగా కనిపిస్తాయి. ప్రతి రంగు నంబరు ప్లేటు(Number plates)కు ఓ ప్రత్యేకత ఉంటుంది. రోడ్డుపై నడిచే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాహనం కేటగిరీని బట్టి ప్రమాద సమయంలో బీమా, ఇతర పనులు సులువుగా పూర్తి చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇందుకు రవాణా శాఖ ఆరు రంగుల్లో నంబరు ప్లేట్లను రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చింది. అవేంటంటే...
- నలుపు రంగు: సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకిచ్చే వాహనాలకు నలుపు రంగు ప్లేటుపై పసుపు రంగు నంబర్లు ఉంటాయి. విలాసవంతమైన హోటళ్ల రవాణాతోనూ ఈ వాహనాలు ప్రాచుర్యం పొందాయి. ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ పర్మిట్ లేకుండానే ఈ కార్లను వాణిజ్య పరంగా వినియోగించవచ్చు.
- ఆకుపచ్చ రంగు : ఎలక్ట్రిక్(విద్యుత్) వాహనాలకు ఆకుపచ్చ రంగు నంబరు ప్లేటు ఉంటుంది. ఎలాంటి కాలుష్య ఉద్గారాలు వెలువడని ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రంగు నంబరు ప్లేటును కేటాయిస్తారు.
- పసుపు రంగు : పసుపు రంగు ప్లేటు మీద నలుపు ఇంకుతో సంఖ్యలు రాసి ఉంటే రవాణా వాణిజ్య వాహనం అంటారు. ఇలాంటి రంగును ట్రక్, ట్యాక్సీలకు చూస్తారు. ప్రయాణికులు, సరకును తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను ఉపయోగిస్తారు.
- తెలుపు రంగు : సాధారణ వాహనాలకు తెలుపు నంబరు ప్లేటు ఉంటుంది. ఈ వాహనాలను ఎటువంటి రవాణా, వాణిజ్య అవసరాలకు వాడేందుకు వీల్లేదు. తెలుపు ప్లేటుపై నలుపు అక్షరాలు లిఖిస్తారు. తెలుపు రంగు చూడగానే అది వ్యక్తిగత వాహనమని సులభంగా గుర్తించవచ్చు.
- ఎరుపు రంగు : కొత్త వాహనాలకు రవాణా శాఖ అధికారి శాశ్వత రిజిస్ట్రేషన్ కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తే ఇలాంటి నంబరు ప్లేట్లు కనిపిస్తాయి. ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఒక నెల వరకు చెల్లుతుంది. అన్ని రాష్ట్రాలు ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ వాహనాలను అనుమతించట్లేదు.
- నీలి రంగు : విదేశీ ప్రతినిధులు, రాయబారుల వాహనాలకు నీలి రంగు నంబరు ప్లేటు ఉంటుంది. ఆ ప్లేటుపై తెలుపు ఇంకుతో నంబరు ముద్రిస్తారు. ఆ ప్లేటు రాష్ట్రం కోడ్ కాకుండా ప్రతినిధుల దేశ కోడ్‌ను సూచిస్తుంది.