తెలంగాణ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మజీద్ గల్లీలో తన మేనమామ ఇంట్లో ఉండే సాయికృష్ణ (20) అనే యువకుడు పబ్జీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు. లింగంపేట మండలం బోనాల్ గ్రామానికి చెందిన సాయికృష్ణ తల్లిదండ్రులు సరోజిని, రాజులు గతంలో మృతిచెందారు. సరోజిని సోదరుడు సహదేవ్ ఇద్దరు అల్లుళ్లు సాయికృష్ణ, సుఖేష్ వర్ధన్‌లకు ఆశ్రయం కల్పించి ఆదరిస్తున్నారు.
జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతున్న సాయికృష్ణ.. ఉదయం నుంచి నిర్విరామంగా పబ్జీ ఆడుతూ ఒత్తిడితో మృతి చెందాడు. యువకుని మృతితో మేనమామ - మేనత్త కన్నీరు మున్నీరయ్యారు. తన అన్న మరణంతో ఒంటరిగా మిగిలిన తమ్ముడు సుఖేష్‌వర్ధన్ బోరున విలపించాడు. మృతిచెందిన యువకుడికి ఇంకా ప్రాణం ఉందేమోనన్న అనుమానంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొంది.