ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తిని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం మైదవోలు గ్రామానికి చెందిన గడిబోయిన బాలాజీ తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. జూదానికి, మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసైన బాలాజీ అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఆలోచనతో ద్విచక్ర వాహనాల దొంగతనానికి అలవాటు పడ్డాడు. మారు తాళాలతో ద్విచక్ర వాహనాలను చోరీ చేసేవాడు. చిలకలూరిపేట పట్టణంలో పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనానికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరించిన అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బాలాజీని అరెస్టు చేశారు.
చిలకలూరిపేట పట్టణంలో వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన 17 ద్విచక్ర వాహనాలు, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనం, విజయవాడ టౌన్లో ఒక ద్విచక్ర వాహనం, గుంటూరు నగరంలోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్ను మొత్తం 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరొక ద్విచక్ర వాహనం యజమాని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మొత్తం బైకులు విలువ 8 లక్షల 15 వేల రూపాయలు ఉంటుందన్నారు. దర్యాప్తుకు సహకరించిన ఎస్సైలు షఫీ, రాంబాబు హెడ్ కానిస్టేబుల్ విజయ్ కిషోర్, కానిస్టేబుల్ ఇర్మియాలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి: చిన్నవయసులో పెద్ద కష్టం!