2 కుటుంబాల మధ్య... 'కుక్క పంచాయితీ'! ఓ పెంపుడు కుక్క చేసిన తప్పిదం.... రెండు కుటుంబాల మధ్య చిచ్చు రగిల్చింది. పరస్పర దాడులకు దిగి ఒకరిపై ఒకరు దాడి చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా విద్యానగర్లో సందీప్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క... పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద రోజూ బహిర్భూమికి వెళ్లడం యజమానికి చిరాకు కలిగించింది. కుక్కను టిఫిన్ సెంటర్‌వైపు రాకుండా చూడాలని హెచ్చరించారు. ఇలా గొడవ మొదలై పరస్పరం దూషణలకు దిగారు. చివరికి పెంపుడు కుక్క యజమాని సందీప్... ఇద్దరు మహిళలపై భయంకరంగా దాడి చేశాడు. మహిళలు అని చూడకుండా.. పిడిగుద్దులతో వీరంగం సృష్టించాడు. అతడిని అక్కడున్నవాళ్లూ అదుపు చేయలేకపోయారు. ఈ ఘటనపై స్పందించిన పెద్దపల్లి పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. దాడి వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.