తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక.. తల్లితో కలిసి ఉంటోంది. ఆమె తండ్రి వారిని చిన్నప్పుడే వదిలి వెళ్లిపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల విజయవాడలోని పిన్నమ్మ ఇంటికి వచ్చింది. అక్కడ కృష్ణ, సోనీ అనే వ్యక్తులు పరిచమయ్యారు. బాలిక ఆర్థిక ఇబ్బందులు గుర్తించిన వీరు రోజుకి పది నుంచి పన్నెండు వేలు సంపాదించవచ్చని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దించారు. లాక్‌డౌన్‌కు ముందు నెల్లూరు హరనాథపురంలోని లావణ్య అనే మహిళ వద్ద బాలికను పంపించారు. లావణ్య తోపాటు ఆమె బంధువులైన పృథ్వి, వినయ్‌లు ఫోన్ల ద్వారా బాలికను విటుల వద్దకు పంపించేవారు.
ఈ క్రమంలో ఈనెల 29వ తేదీ బాలికను ఇందుకూరుపేట మండలం కొరుటూరుకు పంపగా బాలిక అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికకు విముక్తి కలిగించారు. లావణ్య, పృథ్వి, వినయ్‌తోపాటు శ్రీనాథ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన కృష్ణ, సోనీ పరారీలో ఉండగా... వారిని త్వరలోనే పట్టుకుంటామని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి తెలిపారు. బాలికతో జిల్లాకు చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని డీఎస్పీ వెల్లడించారు. ఆ ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.