ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం బాల వెంగన్నపల్లిలో కలకలం రేపిన వృద్దుడు రామసుబ్బయ్య హత్య కేసును కనిగిరి పోలీసులు ఛేదించారు. పాత కక్షలతో పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలో నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
అక్కడికక్కడే మృతి..
పాత కక్షల నేపథ్యంలో అన్నేబోయిన రామసుబ్బయ్య తన సజ్జ పంట వద్దకు రాత్రి సమయంలో కాపలాకు వెళ్లగా.. అర్దరాత్రి రామసుబ్బయ్య నిద్రిస్తున్న సమయంలో తన తమ్ముడి కుమారుడు అన్నేబోయిన వెంకటరమణయ్య గొడ్డలితో మెడపై దాడి చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టగా.. రామ సుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
పాత కక్షలు బహిర్గతం..
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మృతుడు, మృతుడి సోదరుడికి మధ్య పాత కక్షలు బహిర్గతమయ్యాయి.
నిఘా ఆధారంగా..
ఈ క్రమంలో మృతుడి సోదరుడి కుమారుడైన వెంకటరమణయ్యపై అనుమానం రావడంతో నిఘా ఉంచి, పరారీలో ఉన్న వెంకటరమణయ్య మొబైల్ సిగ్నల్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా వెంకటరమణయ్య హత్య చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడ్ని కోర్టులో హాజరు పరచనున్నట్లు కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసరావు వెల్లడించారు.
ఇవీ చూడండి : '41 (ఏ)నోటీసు ఇవ్వకపోవటం కోర్టు ధిక్కరణ అవుతుంది'