బాహ్య వలయ రహదారిపై ప్రయాణం ఎంత సుఖంగా ఉంటుందో... ఆదమరిస్తే ప్రమాదాలకు అంతే ఆస్కారం ఉంది. కొంతమంది వాహనదారులు సువిశాలమైన రహదారిపై వేగంగా వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. 2018 లో బాహ్యవలయ రహదారిపై 104 ప్రమాదాలు జరిగాయి. 48 మంది మృతి చెందగా... 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.
2019లో 107 ప్రమాదాలు చోటు చేసుకోగా 45 మంది మృతి చెందారు. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 58 ప్రమాదాలు జరగ్గా 26 మంది మృతి చెందారు. 14మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మూడేళ్లలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో గాయపడ్డవారున్నారు.
వేగ పరిమితిని తగ్గించారు
బాహ్యవలయ రహదారిపై ప్రమాదాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు, హెచ్ఎండీఏ అధికారులు సమన్వయంతో పలు నివారణ చర్యలు చేపట్టారు. రాత్రి వేళల్లో రహదారి కనిపించక పలు ప్రమాదాలు జరుగుతన్నాయనే ఉద్దేశంతో లైట్లు ఏర్పాటు చేశారు. వేగ పరిమితిని గంటకు 100కి.మీలకు తగ్గించారు.
కెమెరాలు ఏర్పాటు చేసి వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. అయినా వాహనదారులు లెక్కచేయకుండా వేగంగా వెళ్తున్నారు. బాహ్యవలయ రహదారిపై భారీ వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపి ఉంచుతున్నారు. రాత్రి వేళల్లో వేగంగా వెళ్తున్న వాహనదారులు నిలిపి ఉంచిన వాహనాలను గమనించిక వాటిని వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ తరహా ఘటనలు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చెన్నమ్మ హోటల్ సమీపంలో తరచూ ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హీరో రవితేజ సోదరుడు కూడా గతేడాది బాహ్యవలయ రహదారిపై మృతి చెందాడు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో క్యాబ్ వెనకాల కూర్చున్న పైలెట్ మృతి చెందాడు. గతేడాది రోగులతో వెళ్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందారు. ప్రమాదాల నివారణకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
గస్తీ వాహనాలను ఏర్పాటు చేసి.. బాహ్యవలయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా నిలిపి ఉంచిన వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఆటోలు, భవన శిథిలాలు, ఇతర బండరాళ్లు తీసుకెళ్లే వాహనాలను బాహ్యవలయ రహదారిపై అనుమతించడం లేదు. వాహనదారులు నిబంధనలు పాటించి ప్రమాదాలబారిన పడకుండా సురక్షిత ప్రయాణం చేయాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.