కుటుంబ పోషణ నిమిత్తం తమ కుమార్తెకు ఉపాధి చూపమంటూ తల్లిదండ్రులు అతన్ని నమ్మి పనికి పంపారు. వెంట వచ్చిన అభంశుభం ఎరుగని బాలికపై కన్నేసిన అతను బెదిరింపులకు గురిచేసి.. మత్తు కలిపి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు అతని భార్యే సహకారం అందించడం గమనార్హం. ఎస్సై మేడా శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం వలేటివారిపాలేనికి చెందిన ఓ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కష్టంగా ఉండటంతో తమ 15 ఏళ్ల కుమారైని సింగరాయకొండ మండలంలోని బాలిరెడ్డినగర్‌లో నివసిస్తున్న కుంభా యుగంధర్- నాగమణి దంపతుల వద్ద పనికి కుదిర్చారు. యుగంధర్ దంపతులు దిల్లీ, ఆగ్రా, హిమాచల్‌ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రహదారుల వెంట సోఫాలు, కుర్చీలు విక్రయించే చిరు వ్యాపారం సాగిస్తుంటారు. స్వగ్రామంలో బాతు గుడ్ల ఎగుమతి వ్యాపారం కూడా చేస్తుంటారు.
- బెదిరింపులకు గురిచేసి.. మత్తు మందు కలిపి...
బాలికను యుగంధర్ దంపతులు తమ వద్ద పనిలో పెట్టుకున్నారు. సోఫాలు, కుర్చీల విక్రయం నిమిత్తం జనవరిలో దిల్లీ వెళ్తూ ఆమెను కూడా వెంట తీసుకెళ్లారు. అక్కడ దంపతులిద్దరూ బాలికను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. దిల్లీలో మూడు నెలలున్న సమయంలో బాలికను బెదిరింపులకు గురిచేస్తూ యుగంధర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నిసార్లు మత్తు మందు కలిపి కూడా అఘాత్యానికి ఒడిగట్టాడు. ఇందుకు అతని భార్య నాగమణి సహకరించేది. బాతు గుడ్ల వ్యాపారం నిమిత్తం ఈ ఏడాది మేలో వారు తిరిగి సింగరాయకొండలోని బాలిరెడ్డినగర్‌లో ఉన్న తమ స్వగృహానికి వచ్చారు. జులై 26న బాలికను తల్లిదండ్రుల వద్దకు పంపారు. ఆ తర్వాత కూడా తన ఇంటికి పిలిపించుకుని బాలికపై అతను పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. వారం రోజుల క్రితం తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని పామూరు తీసుకెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బాలికను గాయపర్చి రెండుసార్లు తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఇటీవల ఆమె శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆగస్టు 29న కందుకూరు ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు అయిదు నెలల గర్భిణిగా తెలపడంతో అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది.
- పరారీలో నిందితులు...
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన విషయమై ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు సోమవారం ఉదయం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. కరోనా కారణంగా గ్రీవెన్స్ సెల్ లేకపోవడంతో వలేటివారిపాలెం పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై హజరత్తయ్య ఈ విషయాన్ని కందుకూరు సీఐ విజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ కండే శ్రీనివాసులు సూచనల మేరకు సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఎస్సై మేడా శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. ఎస్సై ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది.
ఇదీ చదవండి: వామ్మో...మద్యం ఇలా కూడా రవాణా చేస్తారా..!