Qantas: ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ సంస్థ వినూత్న నిర్ణయం తీసుకొంది. సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో సంస్థలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లను మూడు నెలల పాటు బ్యాగేజీ హ్యాండిలర్స్‌గా పనిచేయాలని ఆదేశించింది. సిడ్నీ, మెల్బోర్న్ ఎయిర్ పోర్టుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో 100 సహాయకుల కోసం సంస్థ ఆపరేషన్స్ హెడ్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు బ్యాగుల లోడింగ్, అన్‌లోడింగ్‌తో పాటు లగేజీని తరలించే వాహనాలను కూడా నడపాల్సి ఉంటుంది. ఇటీవల ఆస్ట్రేలియా విదేశీ ప్రయాణాలను సరళతరం చేయడంతో పెరిగిన రద్దీని తట్టుకొనేందుకు అవసరమైన సిబ్బంది లేక ఈ విమానయాన సంస్థ అవస్థలు పడుతోంది.
"ఓ పక్క వింటర్ ఫ్లూ, కొవిడ్ కేసులు పెరిగాయి. దీనికి తోడు మార్కెట్‌లో లేబర్ కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వనరుల కొరత ఓ సవాలుగా మారింది" అని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కొలిన్ హూగెస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్వాంటాస్‌లోని మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లను వారంలో మూడు లేదా ఐదు రోజులపాటు బ్యాగేజీ హ్యాండిలింగ్ విభాగంలో పనిచేయాలని కోరారు. రోజుకు నాలుగు గంటలు పనిచేయాలా.. లేదా ఆరు గంటలు పనిచేయాలా..? అని వారే నిర్ణయించుకొంటారు. గతంలో కూడా క్వాంటాస్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లతో ఈ విధంగా పనిచేయించింది.
ఈస్టర్ పండుగ సమయంలో ప్రధాన కార్యాలయలంలోని 200 మంది సిబ్బంది ఎయిర్ పోర్టుల్లో పనిచేశారు. ఆస్ట్రేలియా సుదీర్ఘకాలం సరిహద్దులను మూసివేయడంతో దెబ్బతిన్న విమానయాన సంస్థల్లో క్వాంటాస్ కూడా ఉంది. చాలా మంది గ్రౌండ్ స్టాఫ్‌ను తొలగించింది. 2020 నవంబర్‌లో ఆర్థిక నష్టాలను తగ్గించుకోవడానికి వేల మంది శాశ్వత సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. ఆ స్థానంలో 2,000 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకొంది. ఈ క్రమంలో బ్యాగేజీ సేవల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో సంస్థ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
ఇవీ చదవండి: కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీలంక క్రీడాకారులు మిస్సింగ్!
'దుస్తులు, బూట్లు ఎక్కడపడితే అక్కడే.. ఓరి దేవుడా!'.. భార్య గురించి రిషి సునాక్