అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ అపహరణకు యత్నం జరిగింది. ఈ మేరకు 42 ఏళ్ల వ్యక్తిపై అభియోగాలు మోపారు. అతడు గత శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోలోని పెలోసి ఇంట్లకి చొరబడి.. ఆమె భర్త పౌల్ పెలోసీ (82)పై సుత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అతడు నాన్సీ ఎక్కడా అని పెద్దగా కేకలు వేశాడు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిన దాడిగా నాన్సీ అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనలో ఇప్పటికే అరెస్టైన డేవిడ్ డెపాపె అనే వ్యక్తిపై సోమవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అదనంగా రెండు అభియోగాలను నమోదు చేసింది. వీటిల్లో అమెరికా అధికారుల విధులను ఆటంకపర్చేందుకు కుటుంబీకులపై దాడి చేయడం, నాన్సీ పెలోసీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం ఉన్నాయి. అనుమానితుడి వద్ద నుంచి ఒక టేప్ రోల్, తాడు, సుత్తి వంటి వాటిని స్వాధీనం చేసుకొన్నారు.
నాన్సీ కోసం దుండగుడు అడగ్గానే.. ఆమె లేరనీ, వాషింగ్టన్ నుంచి తిరిగిరావడానికి కొన్ని రోజులు పడుతుందని పాల్ చెప్పారు. ఆమె వచ్చేవరకు వేచి ఉంటానని డిపాపే హుంకరించి, పాల్ చేతులు కట్టేశాడు. ‘డెమోక్రటిక్ పార్టీలోని అబద్ధాలకోరులకు నాన్సీ నాయకురాలు. ఆమె ఇప్పటికైనా నిజం చెబితే వదిలేస్తా. లేదంటే ఆమె మోకాలి చిప్పలు పగలకొడతా’ అని డిపాపే పోలీసులకు చెప్పాడు. మోకాళ్లు విరిగిన నాన్సీ చక్రాల కుర్చీలో కాంగ్రెస్‌కు వెళ్లాల్సివస్తుందనీ, తమ చర్యలకు పర్యవసానాలు ఉంటాయని ఇతర సభ్యులకు తద్వారా తెలిసి వస్తుందని అతని ఆలోచన. కెనడా పౌరుడైన డిపాపే 2000 సంవత్సరంలో అమెరికా వచ్చి, వీసా గడువు తీరిపోయిన తరవాత కూడా అక్రమంగా నివసిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే అతడు నాన్సీ పెలోసీని బందీగా పట్టుకోవడానికి యత్నించాడనే నిర్ధారణకు వచ్చారు. ఈ దాడి రాజకీయ ప్రేరేపితమని భావిస్తున్నారు. దీంతో ఈ కోణంలో కూడా సమాంతర దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష స్థానానికి ఉన్న గొలుసు కట్టు వరుస క్రమంలో హౌస్ స్పీకర్ హోదాలో పెలోసీ రెండో స్థానంలో ఉన్నారు.2006లో తొలిసారి అమెరికా చట్టప్రతినిధుల సభ స్పీకర్‌గా పెలోసీ ఎన్నికయ్యారు. 2011 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2019లో మరోసారి స్పీకర్ బాధ్యతలు చేపట్టి అప్పటి నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు అమెరికా చట్టసభకు స్పీకర్‌గా పనిచేసిన ఏకైక మహిళ ఈమే కావడం విశేషం.
ఇదీ చదవండి:బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా సిల్వా.. స్వల్ప తేడాతో బోల్సోనారో ఓటమి
రూ.248 కోట్ల జాక్‌పాట్.. భార్యాపిల్లలకూ చెప్పకుండా కార్టూన్ వేషంలో.. ఎందుకో తెలుసా?