Last Soviet Leader : సోవియట్ యూనియన్ చివరి నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్ (91) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయాన్ని రష్యా వార్తసంస్థలు టాస్, ఆర్‌ఐఏ ప్రకటించాయి. ఆయన 1985 నుంచి 1991 వరకు సోవియట్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు, సోవియట్ నేతృత్వంలోని తూర్పు దేశాలకు మధ్య ఏళ్ల తరబడి జరిగిన ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన మృతికి వివిధ దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు. గోర్బచేవ్ మృతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ గోర్బచేవ్‌ను ఓ అద్భుతమైన దార్శనికత ఉన్న నాయకుడిగా అభివర్ణించారు. ఏళ్ల తరబడి జరిగిన సంఘర్షణలో మార్పులు రావాలని అంగీకరించిన ధైర్యవంతుడిగా పేర్కొన్నారు. "యూఎస్‌ఎస్‌ఆర్ నాయకుడిగా ఆయన అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌తో కలిసి పనిచేసి అణ్వాయుధాల సంఖ్యను విజయవంతంగా తగ్గించారు. కొన్నేళ్లపాటు రాజకీయ అణచివేతకు గురైన దేశంలో ప్రజాస్వామ్య విలువలకు పునాది వేశారు. ఆయన గ్లాస్‌నోస్ట్, పెరెస్తోరికా(పారదర్శకత, పునర్నిర్మాణం)ను విశ్వసించారు. ఇవి కేవలం నినాదాలు మాత్రమే కాదు. సోవియట్ ప్రజలు ముందడగు వేయడానికి మార్గాలుగా నిలిచాయి" అని బైడెన్ పేర్కొన్నారు.
గోర్బచేవ్ సోవియట్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో.. అమెరికా సెనెట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీలో బైడెన్ ఓ సభ్యుడిగా పనిచేశారు. గోర్బచేవ్ అంత్యక్రియలు మాస్కోలోని నొవోడెవిచి శ్మశాన వాటికలో జరగనున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించినందుకు గోర్బచేవ్‌కు 1990లో నొబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ, రష్యాలో మాత్రం ఎక్కువగా ఆయన్ను సోవియట్ విచ్ఛిన్నానికి కారణమైన వ్యక్తిగా చూస్తారు.
ఈ ఏడాది మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఓ కీలక పరిణామంతో గోర్బచేవ్‌కు సంబంధం ఉంది.
సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఉన్నసమయంలో 1990 ఫిబ్రవరి 9వ తేదీన అమెరికా విదేశాంగ మంత్రి జేమ్స్ ఎ. బేకర్‌తో భేటీ అయ్యారు. అప్పుడు జర్మనీ పునరేకీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా నాటో కూటమి తూర్పు వైపునకు విస్తరించదనే హామీ గోర్బచేవ్‌కు లభించినట్లు చెబుతారు. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ఒక సారి గోర్బచేవ్ జర్మనీ పత్రిక బిల్డ్‌తో మాట్లాడుతూ పశ్చిమ దేశాలు తమ వాగ్దానం మరిచాయని ఆరోపించారు. కానీ, ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్లీ ఆయన మాటమార్చారు. తాజాగా నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌ను తీసుకొనేందుకు ప్రయత్నించిన సమయంలో రష్యా తరచూ గతంలో గోర్బచేవ్‌కు ఇచ్చినట్లు చెబుతున్న హామీ అంశాన్ని ప్రస్తావించింది.
ఇదీ చదవండి:అమెజాన్ అడవుల్లోని ఆ ఒక్కడు ఇకలేడు.. కెమెరాకు చిక్కిన దృశ్యాలు
సరిహద్దులో చైనా నిఘా ఏర్పాట్లు, మెరుపు ఆపరేషన్లు జరగకుండా జాగ్రత్తలు