Kabul Gurdwara Attack: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో కార్తే పర్వాన్ గురుద్వారాపై శనివారం జరిగిన దాడి తమ పనేనని ఐసిస్ ఉగ్రసంస్థ ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. ఈ మేరకు అఫ్గాన్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఐసిస్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ సభ్యులు టెలికాం గ్రూప్‌లో పోస్ట్ చేశారు. తమ సభ్యుడొకరు హిందూ, సిక్కు సహా వారికి మద్దతిస్తున్న వర్గాలే లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఓ సెక్యూరిటీ గార్డును కాల్చి తన వద్ద ఉన్న మెషీన్ గన్, గ్రనేడ్లతో గురుద్వారాలో ఉన్నవారిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు.
వరుస బాంబు పేలుళ్లతో కాబుల్‌లోని గురుద్వారా ప్రాంతం శనివారం దద్దరిల్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఓ తాలిబన్ భద్రతా సిబ్బంది, ఓ అఫ్గాన్ సిక్కు జాతీయుడు ఉన్నారు. ఉదయం ఆరుగంటల సమయంలో ఉగ్రవాదులు గురుద్వారాలోకి ప్రవేశించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తొలుత భారీ బాంబు పేలుడు జరిగింది. అరగంట తర్వాత మరో పేలుడుతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. వెంటనే తాలిబన్ ప్రభుత్వ భద్రతా దళాలు రంగంలోకి దిగి.. ఉగ్రవాదులపై దాడి చేశాయి. రెండువైపులా భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. దాదాపు కొన్ని గంటల పాటు జరిగిన ఈ భీకరపోరులో తాలిబన్ దళాలు.. ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ క్రమంలో గురుద్వారాను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు తెచ్చిన కారు బాంబును నిర్వీర్యం చేసి.. పెను ప్రమాదాన్ని నివారించాయి. దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. క్రూరమైన ఈ ఘటనను తప్పుబడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. భక్తుల సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఈ దాడి నేపథ్యంలో అఫ్గాన్‌లోని సిక్కులు, హిందువులను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియను భారత్ వేగవంతం చేసింది. ఈ మేరకు 111 ఈ-వీసాలను జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహమ్మద్‌పై ప్రవక్తపై చేసిన వావాదాస్పద వ్యాఖ్యలకుగానూ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఇస్లామిక్ దేశాలన్నీ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో వెంటనే స్పందించిన భాజపా ఇరువురిని పార్టీ నుంచి బహిష్కరించింది. అలాగే వారు చేసిన వ్యాఖ్యలు భారత ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించవని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: కాబుల్ గురుద్వారాపై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి.. ఖండించిన మోదీ