అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపై ప్రతిరోజూ పాత్రికేయులకు వివరించే విశేష బాధ్యతను చేపట్టిన మొట్టమొదటి భారతీయ అమెరికన్‌గా వేదాంత్ పటేల్ చరిత్ర సృష్టించారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ సెలవుల్లో ఉండడం వల్ల ఆయన బాధ్యతను 33 ఏళ్ల వేదాంత్ పటేల్ మంగళవారం విజయవంతంగా నిర్వహించి వైట్ హౌస్ అధికారుల ప్రశంసలు పొందారు. ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ అణు సమస్య, బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నిక తదితర కీలక పరిణామాలపై వేదాంత్ పటేల్ పాత్రికేయులకు అమెరికా వైఖరిని చక్కగా వివరించారు. ప్రపంచ రంగస్థలంపై అమెరికా ప్రతినిధిగా వ్యవహరించడమనే బృహత్తర బాధ్యతను పటేల్ ఎంతో నైపుణ్యంగా నిర్వహించారని వైట్ హౌస్ ఉన్నతాధికారి మ్యాట్ హిల్ పేర్కొన్నారు. గుజరాత్ నుంచి అమెరికా వలస వెళ్లిన పటేల్ గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్ తరఫున పనిచేశారు.
న్యూయార్క్ జిల్లా కోర్టు జడ్జిగా..
భారత సంతతి న్యాయవాది అరుణ్ సుబ్రమణియన్‌ను న్యూయార్క్ జిల్లా కోర్టు జడ్జి పదవికి నామినేట్ అయ్యారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకాన్ని అమెరికా కాంగ్రెస్ ఎగువ సభ సెనెట్ కనుక ఆమోదిస్తే, న్యూయార్క్ దక్షిణ జిల్లాలోని అమెరికా జిల్లా కోర్టుకు న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి దక్షిణాసియా సంతతి వ్యక్తి సుబ్రమణియనే అవుతారు. 2005 నుంచి 2007 వరకు అమెరికా సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులకు లా క్లర్క్‌గా పనిచేసిన సుబ్రమణియన్ ప్రస్తుతం న్యూయార్క్‌లోని న్యాయ సర్వీసుల సంస్థ సుస్మన్ గాడ్ ఫ్రే భాగస్వామిగా ఉన్నారు.
ఇవీ చదవండి: ప్రపంచ విద్యుత్ సంక్షోభం.. ఐరోపా, చైనాల్లో కరెంట్ కోతలు.. కారణాలేంటి?