Afghanistan Earthquake deaths: అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో మరో 1,500మంది గాయపడినట్లు అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లోని ఖోస్ట్, పక్టికా ప్రావిన్స్‌ల్లోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతినగా, వందలాది భవనాలు నెలమట్టమయ్యాయి.
అఫ్గాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో.. 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. పలుమార్లు ప్రకంపనలు చోటుచేసుకోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. పాక్ సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు పాకిస్తాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఫలితంగా పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వివరించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని పాక్ అధికారులు తెలిపారు.
మరోవైపు భూకంప ధాటికి పక్టికా ప్రావిన్స్‌లో సుమారు 90 ఇళ్లు ధ్వంసమైనట్లు అఫ్గాన్ అత్యవసర విభాగం అధికారి షరఫుద్దీన్ తెలిపారు. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు. అటు, ఖోస్ట్ ప్రావిన్స్‌లోని ఒక ప్రాంతంలోనే 25 మంది చనిపోయినట్లు ప్రకటించారు. 95 మందికి పైగా గాయపడినట్లు వివరించారు. మరోవైపు ప్రకృతి విపత్తుపై అత్యవసర సమావేశం నిర్వహించిన అఫ్గాన్ ప్రధాని మహ్మద్ హసన్ అకుండ్ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
భారత్, అఫ్గాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని 500 కిలోమీటర్ల మేర భూకంప ప్రభావం కనిపించినట్లు యూరోపియన్ సీస్మోలాజికల్ ఏజెన్సీ (ఈఎంఎస్సీ) తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని 11.9 కోట్ల మంది భూ ప్రకంపనలు చవిచూసినట్లు పేర్కొంది. అఫ్గాన్‌నిస్థాన్‌లో ప్రకృతి విపత్తులు సాధారణం కాగా, 2002 సంభవించిన భారీ భూకంపంలో 1000 మందికి పైగా చనిపోయారు. అఫ్గానిస్థాన్‌లో ఏటా సగటున 560 మంది భూకంపాల కారణంగా మరణిస్తున్నట్లు ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక ఒకటి పేర్కొంది.
ఇదీ చదవండి: