Hong Kong elections: హాంకాంగ్ ఎన్నికల విధానంలో మార్పులు జరిగిన తర్వాత తొలిసారి ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఓటింగ్ ప్రారంభమైనప్పటికీ.. చాలా మంది ప్రజలు ఓటేసేందుకు ముందుకు రావడం లేదు. 39 శాతం మంది ఓటు వేయకూడదని ఇప్పటికే నిర్ణయించుకున్నారని హాంకాంగ్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంచనా వేసింది.
గతేడాది సెప్టెంబర్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. మహమ్మారి కారణంగా అధికారులు దాన్ని వాయిదా వేశారు. అయితే, వాయిదాను ప్రజాస్వామ్య అనుకూల వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హాంకాంగ్‌లోని అతిపెద్ద విపక్షమైన డెమోక్రటిక్ పార్టీ ఒక్క అభ్యర్థినీ బరిలోకి దించలేదు.
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 10 వేల మందిని ఇందుకోసం నియమించినట్లు అధికారులు తెలిపారు. ఓటింగ్‌కు వచ్చేలా ప్రజల్ని ప్రోత్సహించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించారు.
Hong Kong election law
ఒక దేశం రెండు వ్యవస్థల విధానానికి చరమగీతం పాడుతూ హాంకాంగ్ ఎన్నికల చట్టానికి ఈ ఏడాది మార్చిలో మార్పులు చేసింది చైనా పార్లమెంట్. హాంకాంగ్‌కు ఇదివరకు ఉన్న ఆర్థిక, చట్టపరమైన స్వతంత్రతను తొలగించింది. హాంకాంగ్ చట్టసభ్యులను ఎంపిక చేసేందుకు చైనా అనుకూలవాద కమిటీకి అధికారాలు కట్టబెట్టింది. చట్టసభ సభ్యుల సంఖ్యను 70 నుంచి 90కి పెంచింది. ఇందులో 40 మందిని చైనాకు వత్తాసు పలికే కమిటీ ఎన్నుకుంటుంది. మరో 30 సీట్లు బిజినెస్ గ్రూపింగ్స్ నుంచి భర్తీ అవుతాయి. నేరుగా ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను 35 నుంచి 20కి కుదించింది. నేరుగా ఎన్నికల్లో పోటీ చేసేవారు కూడా తమ అనుకూల వాదులే ఉండేలా చైనా జాగ్రత్త పడుతోంది.
ఇదీ చదవండి: హాంకాంగ్‌లో చైనా మరో చట్టం.. ఈసారి మీడియా, ఇంటర్నెట్పై!