నమూనాలను సేకరించే ఉద్దేశంతో బెన్ను అనే ఒక గ్రహశకలంపై దిగిన అమెరికా వ్యోమనౌక.. ఆ ఖగోళ వస్తువుపై గందరగోళం సృష్టించింది. తాజాగా సేకరించిన చిత్రాల్లో ఇది వెల్లడైంది. ఒసైరిక్-రెక్స్ అనే ఆ వ్యోమనౌక గత ఏడాది అక్టోబరులో బెన్ను నుంచి నమూనాలను సేకరించింది. ఇందుకోసం ఆ గ్రహశకలంపైకి పీడనంతో కూడిన నైట్రోజన్ వాయువును పంపింది. అనంతరం ఆకాశంలోకి పయనమయ్యేటప్పుడు వ్యోమనౌకలోని రాకెట్ నుంచి వేడి వాయువులు వెలువడ్డాయి. వీటివల్ల అక్కడ బెన్నుపై గందరగోళం తెలెత్తినట్లు తాజాగా వ్యోమనౌక తీసిన చిత్రాల్లో వెల్లడైంది.
టన్ను బరువున్న ఒక శిల 12 మీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ ఒక గొయ్యి కూడా ఏర్పడినట్లు వివరించారు. ఈ వ్యోమనౌక దాదాపు కిలో మేర గ్రహశకల నమూనాలను సేకరించింది. ఇది వచ్చే నెలలో భూమి దిశగా పయనాన్ని ఆరంభిస్తుంది. 2023లో పుడమికి చేరుకుంటుంది. బెన్ను.. భూమికి 29.3 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్బన పదార్ధాలు పుష్కలంగా ఉన్న ఆ గ్రహశకలంపై పరిశోధనల ద్వారా సౌర కుటుంబంలోని గ్రహాలు ఏర్పడిన తీరు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: పడవ మునక- 21మంది శరణార్థులు మృతి