అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల పాత్ర కీలకంగా మారింది. అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీతో పాటు, ప్రతిపక్ష డెమొక్రాటిక్ కూడా మనోళ్ల ఓట్లపై కన్నేశాయి. డెమొక్రాటిక్ పార్టీ అయితే ఏకంగా భారత మూలాలున్న కమలా హ్యారిస్ ను ఉపాధ్యక్ష పదవికి నిలబెట్టింది.
ఓట్ల పరంగా చూస్తే ఇండో-అమెరికన్ల సంఖ్య పెద్ద ఎక్కువేమీ కాదు. కానీ, ప్రపంచంలో అధిక ప్రాధాన్యం లభిస్తోంది. ఇందుకు దారితీసిన పరిస్థితులపై అమెరికాలో మాజీ భారత రాయబారి మీరా శంకర్ ఈటీవీ భారత్ తో పంచుకున్నారు.
"అమెరికన్-ఆఫ్రికన్ జార్జి ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో మరణించిన తర్వాత 'నల్లవారి జీవితాలూ ముఖ్యమే' పేరిట ఉద్యమం నడుస్తోంది. దీంతో జాతి అనేది ఎన్నికల అంశంగా మారింది. దానికి మించి అమెరికా విలువలు, విధానాల ప్రకారం అందరికీ అవకాశాలు కల్పించాలన్నది కూడా ప్రాధాన్యం పొందింది. అమెరికాలో ఇండియన్-అమెరికన్ ఓట్లు కేవలం 4.7 శాతమే. ఇది పెద్ద సంఖ్యేమీ కాదు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రబావం చూపే అవకాశం ఉంది. ఆ రాష్ట్రాలు చూపించే మొగ్గు ఆధారంగా విజయావకాశాలుంటాయి. పార్టీలకు విరాళాలు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు ఆధిపత్యం వహిస్తున్నారు. అందుకే, అన్ని పార్టీలకు మనోళ్లు ముఖ్యమైన ఓటర్లుగా మారారు."
-మీరా శంకర్, అమెరికాలో భారత మాజీ రాయబారి
కశ్మీర్ విషయంలో కమలా హ్యారిస్ బహిరంగంగానే మోదీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు, డెమొక్రాట్లు మానవ హక్కులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. మరో వైపు మోదీ- ట్రంప్ ల మధ్య మంచి దోస్తీ ఉంది. ఇలాంటి సమయాల్లో ఉభయ దేశాల సంబంధాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు మీరా శంకర్.
"చైనా సవాళ్ల దృష్ట్యా ఏ పార్టీ అయినా భారత్ తో వ్యూహాత్మక సంబంధాలు నెలకొల్పాల్సి ఉంటుంది. డెమొక్రాట్లు మానవ హక్కులకు ప్రాధాన్యత ఇచ్చినా, కీలక ప్రయోజనాలను కాదనదు. హెచ్1బీ వీసాలు, దిగుమతులపై పన్నులు విధిస్తూ ట్రంప్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నింటినీ భారత ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో పరిరక్షించుకోవాలి."
-మీరా శంకర్, అమెరికాలో భారత మాజీ రాయబారి
ఇదీ చదవండి: రష్యా జోరు.. మరో కరోనా టీకాపై ప్రయోగం సక్సెస్