రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గట్లేదు. కేసుల నిర్ధరణ కోసం నమూనాల సేకరణ అదే స్థాయిలో జరుగుతోంది. మరి పరీక్షలు సకాలంలో జరుగుతున్నాయా అనే ప్రశ్నలకు తావిస్తోంది ప్రకాశం జిల్లాలో పరిస్థితి..! జిల్లావ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో 27 వేల నమూనాలు వృథా అయ్యాయని వైద్య సిబ్బందిపై కలెక్టర్ పోలా భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన పేర్లు, ఐడీ నంబర్లు వేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నమూనాలు సేకరించాక మూతలు సరిగా వేయకపోవడం వల్ల పరీక్షలకు పనికిరాకుండా పోయాయన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇతర జిల్లాల్లో ఇదే పరిస్థితి
ప్రకాశం మాదిరిగానే ఇతర జిల్లాల్లోనూ నమూనాలు పరీక్షలకు నోచుకోవడం లేదు. సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. శనివారం ఉదయం వరకూ రాష్ట్రంలో 11 లక్షల 36 వేల 225 నమూనాలు సేకరించారు. ప్రకాశం జిల్లాలో 27 వేల నమూనాల వృథాను పరిగణనలోకి తీసుకుని జిల్లాలవారీగా విశ్లేషిస్తే మరిన్ని లొసుగులు బయటపడే అవకాశం ఉంది. సుమారు 10 జిల్లాల్లో ఒక్కోచోట 4 నుంచి 5 వేల నమూనాలు పరీక్షించకుండానే వదిలేశారన్న విమర్శలున్నాయి. సేకరించిన నమూనాలు సకాలంలో ల్యాబ్‌కు వెళ్తున్నాయా? బాధితుల వివరాల నమోదు సక్రమంగా ఉందా? సకాలంలో ఫలితాలు వస్తున్నాయా? వంటి అంశాలపై పర్యవేక్షణ కొరవడుతోంది.
ఇదీ చదవండి: