Jabardast Sunami Sudhakar: ఎన్టీఆర్ నటవిశ్వరూపం, ఏఎన్నార్ చలాకీతనం, రజనీ కాంత్- చిరంజీవిల స్టైల్, బాలకృష్ణలా డైలాగులు, నాగార్జున హావభావాలు.. ఇలా దాదాపు 20కి పైగా నటులను ఒకేసారి స్టేజిపైనే చూయించేస్తాడు ఆ కమెడియన్. హీరోలను అనుకరిస్తూ ప్రేక్షకలను అలరిస్తాడు. కడుపుబ్బా నవ్విస్తాడు. అతడే సునామీ సుధాకర్. తాజాగా ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన అతడు.. తన 'జబర్దస్త్' ప్రయాణం, నటనను కెరీర్‌గా ఎందుకు ఎంచుకున్నాడు? సహా పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఆ సంగతులివీ..
ఆ హీరోల ప్రశంసలు.. "2013 నుంచి చంద్ర టీమ్‌లో చేస్తున్నాను. నేను, చంద్ర, మిమిక్రీ రాము.. 'బతుకు జట్కా బండి' అనే స్కిట్ చేశాము. నాగబాబు, రోజాకు బాగా నచ్చింది. మాకు మంచి పేరు తీసుకొచ్చింది. అక్కడ నుంచే నా 'జబర్దస్త్' ప్రయాణం మొదలైంది. అదిరే అభి, చంటి, వేణు వండర్స్ టీమ్స్‌లో చేశాను. అప్పుడు నాగబాబు గారు.. 'నువ్వు, భాస్కర్ టీమ్‌లీడర్‌గా ట్రై చేయండి' అని అన్నారు. అప్పుడు టీమ్ లీడర్ అయ్యాం. భాస్కర్ నాలోని ప్రతిభను బాగా బయటకు లాగాడు. అప్పుడు నాలోని కొత్త కోణాలు బయటికొచ్చాయి. ఆ తర్వాత 'పటాస్'లో చేసిన స్కిట్లు బాగా పాపులర్ అయ్యాయి. చిరంజీవి, వెంకటేశ్, బ్రహ్మానందం, రవితేజ వంటి వారు మమ్మల్ని గుర్తించి ప్రశంసించారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.
అలా ఎంట్రీ ఇచ్చా.. "మా నాన్నగారు ఓ చిన్న ఆర్టిస్ట్. రిటైర్డ్ టీజర్. మహబూబ్‌నగర్‌లోని ఓ చిన్న ఇన్స్టిట్యూట్లో ఆర్టిస్టుల బృందం ఉండేది. అక్కడే ఉండేవాడిని. నాకు మూడు, నాలుగేళ్ల వయసు నుంచే మా నాన్నగారితో తిరిగేవాడిని. పాటలు పాడటం కూడా నేర్చుకున్నా. సినిమా హీరోలను అనుకరించేవాడిని. అలా మా నాన్న ప్రోత్సహించడం వల్ల హైదరాబాద్ వచ్చా. ఇక్కడ ఉన్న నా స్నేహితులు కూడా సపోర్ట్ చేశారు. చాలా కష్టపడ్డాను. అయితే అది ఇష్టంగానే. దేవుడి మండపాల వద్ద ప్రోగ్రామ్స్ చేశాను. స్కూల్లో పార్ట్ టైమ్ జాబ్ చేశా. ఆ తర్వాత 'పరుగు', 'నేనింతే', 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' వంటి సినిమాలు చేశాను. ఆ సమయంలో మిమిక్రీ రాము ద్వారా 'జబర్దస్త్'లోకి ఎంట్రీ ఇచ్చాను. అనంతరం మంచి పేరు వచ్చింది. మా నాన్నగారు గొప్పగా, ఆనందంగా భావించేవారు. మొత్తంగా 'జబర్దస్త్'లో ఉన్న వాళ్లందరూ బాగా సెటిల్ అయ్యారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆది , చలాకీ చంటికి మూవీస్‌లో ఆఫర్లు వచ్చాయి." అని సుధాకర్ చెప్పాడు.
20 దేశాలు, ఆరు వేల షోలు.. "ఆర్టిస్టులు అన్నాక అన్ని క్యారెక్టర్లు చేయాలి. మన మీద పంచ్‌లు వేయించుకోవాలి. మనం ఇంకొకరి మీద పంచ్‌లు వేయాలి. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. పర్సనల్‌గా ఫీల్ అవ్వకూడదు. లేదంటే వెళ్లిపోవాలి. నన్ను గాలిపటాల సుధాకర్ అనేవారు. 20 దేశాల వరకు తిరిగా. ఆరు వేల షోస్ చేశా. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, రజనీ కాంత్, చిరంజీవి, బాలకృష్ణ.. ఇలా 20 మంది నటులను ఒకేసారి స్టేజ్‌పైనే చూపించేవాడిని. కానీ జబర్దస్త్ వచ్చాక సునామీ సుధాకర్‌గా పేరు పెట్టారు. ఓ హోదా వచ్చింది. పేరు సంపాదించడం అంత ఈజీ కాదు. కానీ నాకు స్టార్డమ్ రావడం సంతోషంగా ఉంది" అని సునామీ సుధాకర్ అన్నాడు.
ఇదీ చూడండి: రెండేళ్లు టార్గెట్.. 'జబర్దస్త్'లో ఆయన అడిగిన ఆ ఒక్క ప్రశ్న.. లైఫ్ ఛేంజ్!