ఇండస్ట్రీలో హీరోలే కాదు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో సీనియర్ యాక్టర్ సుబ్బరాజు ఒకరు. విలన్ రోల్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్, కామెడీ పాత్రలు ఇలా ఏదైనా తన దైన నటనతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. అలా భిన్నమైన పాత్రలు పోషిస్తూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తానింకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలను వివరించారు. ఇంకా అప్పట్లో తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు, సినీ పరిశ్రమలో తన ప్రయాణం ఎలా సాగింది? వంటి విషయాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం తాను చేస్తున్న పని తనకు సంతృప్తిగానే ఉందని చెప్పారు. ఫిట్‌గా ఉంటే మంచి క్యారెక్టర్లు వస్తాయని లేదంటే తండ్రి పాత్రలు చేయాల్సివస్తుందని నవ్వుతూ అన్నారు.
ఇక ప్రేమ గురించి ఆయనను అడిగితే..'మా న్నాన్న ఓ టీచర్. దీంతో చిన్నప్పటి నుంచి భయం ఉండేది. నేను ఏ తప్పు చేసినా అందరూ ఇంటికి వచ్చి మరీ చెప్పేసేవారు. దీంతో నేను బుద్ధిగానే ఉండాల్సి వచ్చింది. అలా ఓ వయసు వచ్చాక చూసి ఆరాధించడం తప్ప డీప్ లవ్‌లు ఏం లేవు' అని చెప్పుకొచ్చారు. అనంతరం పెళ్లి గురించి వేసిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'పెళ్లి ఎప్పుడూ కావాలని చేసుకోకూడదు, ఆ అవసరం వచ్చినపుడు చేసుకోవాలి. ఇప్పటివరకు పెళ్లితో నాకు అవసరం రాలేదు. వచ్చినపుడు కచ్చితంగా చేసుకుంటాను' అని అన్నారు. అయితే, అప్పట్లో తనపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు చాలా డిస్ట్రబ్ అయ్యానని చెప్పారు. 'ఆ సమయంలో నా తల్లిదండ్రుల గురించి ఆందోళన చెందాను.. నా తప్పు లేకున్నా వాళ్లను ఎవరైనా ప్రశ్నిస్తారనే భయం ఉండేది' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి : రాజకీయ నేతగా చరణ్.. భారీగా తరలివచ్చిన అభిమానులు.. పోలీసుల ఆంక్షలు!