కన్నడ చలన చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించిందన్న వార్తలపై నటి రష్మిక స్పందించారు. ఆ వార్తల్ని ఖండిస్తూ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టంచేశారు. "'కాంతార' సినిమా విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిత్రం చూశాక బృందానికి నేను మెసేజ్ పెట్టా. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో బయటివారికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. మెసేజ్‌లు కూడా బయటకు రిలీజ్ చేయలేను. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రేక్షకులకు చెప్పడం నా బాధ్యత" అని రష్మిక వివరించారు.
జరిగిందేంటంటే..?
కొన్ని రోజుల క్రితం.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌కు రష్మిక ఇంటర్వ్యూ ఇచ్చారు. విద్యార్థిగా ఉన్నప్పుడు తాను ఓ అందాల పోటీలో పాల్గొని విజయం అందుకున్నానని, పేపర్లో వచ్చిన తన ఫొటో చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిందని చెప్పారు. అయితే, తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన పరంవా నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి చూపించలేదంటూ పలువురు కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె నటించిన తొలి చిత్రం 'కిరిక్ పార్టీ'ని పరంవా నిర్మించగా 'కాంతార' ఫేం రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. దాంతో, ఈ ఇద్దరి మధ్య బేధాభిప్రాయలు వచ్చాయని, ఎంతోమంది ప్రముఖులు 'కాంతార'ను ప్రశంసించినా ఆమె ఏం మాట్లాడకపోవడానికి కారణం అదేనంటూ ఆరోపించారు. కృతజ్ఞతాభావంలేని ఆమెను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపడంతో మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది కొన్ని రోజుల క్రితం 'టాక్ ఆఫ్ ది టౌన్'గా మారడంతో తాజాగా 'ఈటీవీ'తో మాట్లాడిన రష్మిక ఆ వార్తలకు చెక్ పెట్టారు.
ఇదీ చదవండి: ఆ స్టార్ హీరో సినిమాతో సింగర్ సునీత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ