నితిన్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'మాచర్ల నియోజకవర్గం' మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక-నిర్మాతలు సన్నాహాలు చేసినా సాధ్యపడలేదు. అలా జులై 8కి వాయిదా పడింది. తాజాగా మరో కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 12న ఈ ప్రాజెక్టును రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడిస్తూ.. 'డేట్‌లోనే ఛేంజ్.. కలెక్టర్‌సాబ్ యాక్షన్‌లో కాదు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు నితిన్ కొత్త లుక్‌ను విడుదల చేశారు.
ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్.. కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డిగా కనిపించనున్నాడు. కృతిశెట్టి, కేథరిన్ కథానాయికలు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, ఫైట్స్: వెంకట్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల. ఈ సినిమాతో పాటు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు నితిన్. టైటిల్ ఖరారుకాని ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక.
కాజల్‌పై నెటిజన్ల ట్రోల్స్!: మదర్స్ డే సందర్భంగా నటి కాజల్ అగర్వాల్ చేసిన ఓ పోస్ట్ ఆమెపై ట్రోల్స్‌కు దారితీసింది. తన తల్లిపై ప్రేమను చాటుతూ ఇంగ్లీష్‌లో ఓ కవితను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు కాజల్. దీనిని ఎంతో మంది లైక్ చేశారు. అయితే తాను రాసిన కవిత కాజల్ సొంతంగా రాసిన దానిలా పోస్ట్ చేశారని ఓ యూజర్ అభ్యంతరం వ్యక్తంచేశారు.
"ఇది కాజల్ సొంత కవిత లాగా ప్రచురితమవుతోంది. నేను రాసిన దానిని మార్చి ఈ విధంగా పోస్ట్ చేయడం సరి కాదు" అంటూ సారా అనే ఓ యూజర్ కాజల్ పోస్ట్‌కు అభ్యంతరం తెలిపారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆమెకు క్రెడిట్ ఇస్తూ పోస్ట్‌ను ఎడిట్ చేశారు కాజల్. అనంతరం కామెంట్లను ఆఫ్ చేశారు.
ఇదీ చూడండి: అలా చేస్తే నా కోరికలు తప్పకుండా నెరవేరేవి: సమంత