Bro Movie Premiere : సుప్రీంస్టార్ సాయిధరమ్ తేజ్ - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిసి నటించిన చిత్రం 'బ్రో'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 28న విడుదల కానుంది. ఓవర్సీస్లో ఇప్పటికే 'బ్రో' మేనియా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా ప్రీమియర్ షో సేల్స్‌లో పవన్ కల్యాణ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఏయే దేశాల్లో 'బ్రో' ప్రీమియర్ షోలు ఎంత వసూల్ చేశాయంటే..
అమెరికా వ్యాప్తంగా 230 లొకేషన్లలో కలిపి బ్రో సినిమా 710 ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. కాగా ఈ ప్రీమియర్స్‌కు గాను సినిమా.. 3,10,140 (సుమారు రూ. 2.5 కోట్లు) డాలర్లు వసూల్ చేసింది. యూఎస్ తర్వాత అత్యధికంగా యూకేలో.. 55 లొకేషన్లలో 87 ప్రీమియర్స్ కలిపి 91,963 (సుమారు రూ. 96 లక్షలు) పౌండ్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియాలో 27 లొకేషన్లలో 46 ప్రీమియర్ షోలకు గాను 35,430 (సుమారు రూ. 19.50 లక్షలు) ఆస్ట్రేలియన్ డాలర్లు, ఇక అత్యల్పంగా కెనడాలో 6 లొకేషన్లలో 22 ప్రీమియర్స్ కలిపి 27,220 (సుమారు రూ. 16.80 లక్షలు) కెనడియన్ డాలర్లు వసూల్ చేసింది. అయితే ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు ఈ రేంజ్లో వసూల్లు చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్‌గా జరిగింది. సినిమాలో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ సహా.. నటులు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హీరో సాయిధరమ్ తేజ్‌కు జంటగా కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్లు హీరోయిన్లుగా నటించారు. కాగా తమిళ సినిమా 'వినోదయ సిత్తం' దర్శకుడు సముద్రఖనియే 'బ్రో' సినిమాను తెరకెక్కించారు.
అయితే ఈ కార్యక్రమంలో గుడుంబా శంకర్ సినిమాలోని 'కిల్లి కిల్లి' పాటను రిమిక్స్ చేసి ప్రోమో వదిలారు. ఈ ప్రోమోలో హీరోలు సాయిధరమ్ తేజ్ - పవన్ కల్యాణ్ - సంగీత దర్శకుడు తమన్ ముగ్గురు కలిసి స్పెప్పులేశారు. కాగా ఈ ప్రోమో యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.