ఆయన కథలోని పాత్రలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రేక్షకులను ఉర్రూతలూపే మంచి కిక్ ఉంటుంది. రచయితగా సూపర్ హిట్ కథలను అందించడమే కాక దర్శకుడిగా చక్కటి చిత్రాన్ని తెరకెక్కించి, నటుడిగా, టీవీ యాంకర్‌గా తన ప్రతిభ చూపిన క్రేజీ రైటర్ వక్కంతం వంశీ. తన భార్య శ్రీవిద్యతో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన తన సినీ ప్రయాణం గురించి వివరించారు. అలానే దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.
టెంపర్ అవకాశం అలా.. ఎన్టీఆర్ వల్లే ఈ ఛాన్స్ కూడా వచ్చింది. తనతో నా ఆలోచనలన్నీ పంచుకుంటూ ఉంటా. అలా ఒకసారి టెంపర్ ఐడియా చెప్పాను. 3 సంవత్సరాల తర్వాత పూరీ, తారక్‌లకు కథ కుదరకపోతే నన్ను అడిగారు. ఆ టెంపర్ ఐడియాను వెంటనే తారక్‌కు చెప్పా. ఆయన పూరీకి చెప్పమన్నారు. నేను మొదట పూరీ జగన్నాథ్‌కు కథ చెప్పాలంటే భయపడ్డా. కానీ సగం వినగానే పూరీ ఓకే చేసేశారు.
టెంపర్ క్లైమాక్స్.. పూరి షాక్.. 'టెంపర్'కు సంబంధించిన కథ మొత్తం అయిపోయింది. క్లైమాక్స్‌లో పూరీ గారు చెప్పింది నాకు నచ్చట్లేదు. ఆయన ఎవరినీ నొప్పించరు. ఆయనతో 'మీరు చెప్పే క్లైమాక్స్ నచ్చలేదని' ఎలా చెప్పాలా అనుకున్నా. ఆఖరికి ధైర్యం చేసి, 'నాకు ఒక గంట టైమ్ ఇవ్వండి' అని బాగా ఆలోచించి క్లైమాక్స్ చెప్పా. అది విని పూరీ గారు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నాకు ఇంకా గుర్తుంది. సీట్‌లో నుంచి లేచి నన్ను హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత అందరం భోజనానికి కూర్చున్నాం. పూరీ ఉన్నట్లుండి భోజనం ప్లేట్ పక్కకు నెట్టేశారు. 'నేను భోజనం చేయను నువ్వు చెప్పిన క్లైమాక్స్‌కు కడుపు నిండిపోయింది' అని సంతోషంగా అన్నారు. నా జీవితంలో నేను మర్చిపోలేను ఆ సంఘటన అది.
ఇదీ చూడండి: హరిద్వార్‌లో కృష్ణ అస్థికల నిమజ్జనం.. మనవడి చేతుల మీదుగా.