తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 120 చిత్రాల్లో నటించిన ఈయన.. ప్రముఖ దర్శక నిర్మాత విజయబాపినీడుకు అల్లుడు. ఈయన మృతితో పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని విజయవాడకు చెందిన జనార్దన్‌కు చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి ఎక్కువ. దీంతో కాలేజీ రోజుల్లోనే పలు నాటకాల్లో కీలకపాత్రలు పోషించి తోటి విద్యార్థులను అలరించారు. కళాశాల చదువు పూర్తైన వెంటనే 'కళామాధురి' అనే నాటక సంస్థను స్థాపించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే తెలిసినవారి సాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన 'గజదొంగ' కోసం మొదటిసారి వెండితెరపై నటించారు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలో దర్శకుడు విజయ బాపినీడు కుమార్తెను ఆయన వివాహమాడారు. అనంతరం తన మామయ్య తెరకెక్కించిన 'గ్యాంగ్‌లీడర్'లో పోలీస్ అధికారిగా నటించి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. సినిమాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోనూ ఆయన నటించారు. నిర్మాత, దర్శకుడిగా పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.
ఇదీ చూడండి: వరల్డ్‌వైడ్‌గా ఆ టాప్ లిస్ట్‌లో ధనుశ్ మూవీ.. 'ఆర్ఆర్ఆర్'కు దక్కని చోటు