Arrest: చెన్నై మైలాపూర్‌లోని బృందావన్ నగర్ ద్వారకా కాలనీకి చెందిన శ్రీకాంత్ (60) ఆడిటర్. ఆయన భార్య అనురాధ (55). కుమార్తె సునంద ప్రసవం కోసం గత నెల అమెరికా వెళ్లిన శ్రీకాంత్ దంపతులు.. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తిరిగి వచ్చారు. తల్లిదండ్రులు ఇంటికి చేరారా.. లేదా అని సునంద ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో కంగారుపడి ఇంద్రానగర్‌లోని బంధువు దివ్యకు విషయం చెప్పారు. దివ్య, తన భర్త రమేష్‌తో కలిసి మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాంత్ ఇంటికి వెళ్లగా తాళం వేసి కనిపించింది. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మైలాపూర్ డిప్యూటీ కమిషనరు గౌతమన్ నేతృత్వంలోని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విమానాశ్రయం నుంచి శ్రీకాంత్ దంపతులను వారి కారు డ్రైవరు లాల్ కృష్ణ తీసుకువెళ్లినట్లు తెలియడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. లాల్ కృష్ణ, అతని స్నేహితుడు రవి అప్పటికే చెన్నై నుంచి పరారయ్యారు. జీపీఎస్ ఆధారంగా చెన్నై పోలీసులు ప్రకాశం జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, టంగుటూరు ఎస్సై, హైవే పోలీసులు 16వ నంబరు జాతీయ రహదారి టంగుటూరు టోల్‌గేట్‌వద్ద మాటు వేసి నిందితుల కారును నిలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం టంగుటూరు స్టేషన్‌కు తీసుకువచ్చారు.
మైలాపూర్ ఇంట్లో దంపతులను హత్య చేసి మృతదేహాలను చెంగల్పట్టు జిల్లా నెమిలిచ్చేరి నిర్లవణీకరణ ప్లాంట్ సమీపాన ఉన్న శ్రీకాంత్ ఫాంహౌస్‌లో నిందితులు పూడ్చిపెట్టినట్టు తెలిసింది. అనంతరం ఇంటి బీరువాలోని రూ.20 లక్షల నగదు, భారీగా నగలు తీసుకుని పరారయ్యే క్రమంలో ప్రకాశం జిల్లాలో పట్టుబడ్డారు. నిందితుల వద్ద సుమారు 50 కేజీల బంగారం, కొంత వెండి ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులిద్దరూ నేపాల్‌కు చెందినవారని తెలిసింది.
ఇదీ చదవండి: నాగార్జున వర్సిటీలో.. తొలిరోజు ఉద్యోగ మేళా విజయవంతం