- బలవన్మరణం... ఎంత దారుణం!
A Man Died in Train Accident: ఆ యువకుడికి ఏ కష్టం వచ్చిందో ఏమో ప్రయాణికులు చూస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని యువకుడు (25) తునిలో హాల్టులేని నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి బలవన్మరణం చెందడం చూపరులను తీవ్రంగా కలచివేసింది. ఈ సంఘట దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని 1వ నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అంతవరకు ప్లాట్‌ఫాంపై అటుఇటు తిరుగుతూ ఉన్న అతడు రైలు రాకను గమనించి పట్టాలపైకి దిగి, ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని రైలుకింద పడిపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ యువకుడు రాత్రి నుంచి స్టేషన్ పరిసరాల్లోనే తిరుగుతున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందని, మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలూ లభించలేదని పోలీసులు చెప్పారు.
- రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం
Accident in Kadapa: కడప శివారులోని రామాంజనేయపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. కడప జిల్లా సిద్ధవటం మండలం టక్కులుకి చెందిన పాపయ్య.. కడప ఆర్టీసీ డిపోలో డ్రైవర్. శనివారం పని ముగించుకుని ద్విచక్రవాహనంపై టక్కులికి బయలుదేరారు. అయితే రామాంజనేయపురం వద్దకు రాగానే పెట్రోల్ అయిపోయింది. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న బంకులో పెట్రోల్ తీసుకునేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో పాపయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రిమ్స్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- ఆటోను ఢీకొట్టిన కారు..14 మందికి గాయాలు
Accident at Parnasala: కృష్ణా జిల్లా మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గూడూరు పర్ణశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న 14 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రులంతా మచిలీపట్నం గిలకలదిండి ప్రాంతానికి చెందిన మహిళలుగా గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గూడూరు ఎస్సై మదినా బాషా.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటి వరకూ సేవ్ అమరావతి.. ఇకపై బిల్డ్ అమరావతి: రాజధాని ఐకాస