ARREST : తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సుధీర్ వెల్లడించారు. లోన్ యాప్ ఆగడాల వల్లే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ యాప్ నిర్వాహకులు లావాదేవీలు చేస్తున్నారని.. ఆర్థిక లావాదేవీలకు సహకరిస్తున్న ఏడుగురు ఉద్యోగులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. లోన్ యాప్ నిర్వాహకులపై నిఘా పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.
అసలేం జరిగిందంటే: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్‌లైన్ రుణయాప్‌ల కారణంగానే వీరు బలవన్మరణం పొందినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు పదేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చారు. ఆరేళ్ల కిందట రమ్యలక్ష్మితో వివాహమైంది. నగరంలోని శాంతినగర్‌లో నివాసముంటున్నారు. వీరికి తేజస్వి నాగసాయి(4), లిఖితశ్రీ(2) ఇద్దరు సంతానం. దుర్గారావు పెయింటింగ్, రమ్యలక్ష్మి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
రమ్యలక్ష్మి ముఖం వచ్చేలా మార్ఫింగ్ చేసి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల వీరు రెండు ఆన్‌లైన్ రుణయాప్‌లలో కొంత మొత్తం నగదు అప్పుగా పొందారు. వాటిని నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. వారి బెదిరింపులను తాళలేక కొంత మొత్తం నగదును చెల్లించారు. మరింత చెల్లించాలని, లేదంటే రమ్యలక్ష్మి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతామని హెచ్చరించారు. ఈ బాధలు తప్పించుకోవాలనే ఉద్దేశంతో దుర్గారావు పది రోజుల కిందట ఆన్‌లైన్ డెలివరీ బాయ్‌గా చేరి అదనపు సంపాదన కోసం ప్రయత్నించారు.
ఈలోగా అసభ్యకరంగా ఉన్న ఓ చిత్రానికి రమ్యలక్ష్మి ముఖం వచ్చేలా మార్ఫింగ్ చేసి యాప్‌ల నిర్వాహకులు వాట్సాప్‌లో బెదిరించారు. రెండు రోజుల వ్యవధిలో పూర్తి రుణాన్ని వడ్డీతోసహా చెల్లించకుంటే ఈ చిత్రంతోపాటు అసభ్యకరంగా వీడియోను తయారు చేసి పంపుతామని హెచ్చరించారు. దాంతో గుండెపగిలిన దంపతులు, నిస్సహాయస్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రమ్యలక్ష్మి అక్క, బావలు రాజమహేంద్రవరంలోనే నివసిస్తున్నారు. ఈ నెల 5న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జరిగిన ఓ దిన కార్యక్రమానికి నలుగురూ రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. సాయంత్రానికి నగరానికి తిరిగివచ్చారు. దుర్గారావు దంపతులు తమకు పనుందని చెప్పడంతో వారితో వచ్చిన జంట ఇంటికెళ్లిపోయారు. అప్పటికే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకోవడంతో నగరంలోని గోదావరి గట్టున ఉన్న ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు.
ఆ రోజు అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో బావ రాజేష్‌కు రమ్యలక్ష్మి ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కాల్ కట్ చేశారు. వారు లాడ్జి వద్దకు వచ్చేసరికి దుర్గారావు దంపతులు గదిలో విష రసాయనం తాగి విగత జీవులుగా పడి ఉన్నారు. వారిని వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున గంట వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు వదిలినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇవీ చదవండి: