KIDNAP CASE : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. చిలకలూరిపేటకు చెందిన అరుణకు... తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పేరంబాకంకు చెందిన ధాన్యం వ్యాపారి శరవణన్‌తో వివాహమైంది. దసరా సందర్భంగా అరుణ పుట్టింటికి వచ్చారు. గతరాత్రి చార్లెస్ కాన్వెంట్ సమీపంలోని అమ్మవారి ఆలయానికి మేనత్తతో కలిసి అరుణ కుమారుడు.. రాజీవ్‌సాయి వెళ్లాడు. కాసేపటి తర్వాత ఇంటికి వెళ్తానని బాలుడు చెప్పగా కూతవేటు దూరమే కావడంతో బంధువులు సరేనన్నారు. అప్పటికే ఆ మార్గంలో కారులో కాపు కాచిన దుండగులు... బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇంటికెళ్లిన బంధువులు బాలుడు కనిపించకపోవటంతో ఆందోళనకు గురయ్యారు. పేరంబాకం నుంచి గ్రామానికి రావడం తొలిసారి కావడంతో దారి తెలియక ఎటైనా వెళ్లాడేమోనని ఊళ్లో వెతికారు. అప్పటికీ ఆచూకీ తెలియకపోవడం, ఆ వెంటనే తండ్రికి కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు అర్ధరాత్రి నుంచి కిడ్నాపర్ల కోసం వెదుకులాట ప్రారంభించారు. శరవణన్‌కు వచ్చిన ఫోన్ నంబర్‌తో పాటు, కిడ్నాప్ సమయంలో ఆలయ సమీపంలో ఉన్న ఫోన్ నంబర్లను విశ్లేషించారు. కిడ్నాపర్లు ఎవరనే దానిపై ఓ అంచనాకు వచ్చారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై... కారులో కిడ్నాపర్లు వెళ్తున్నట్లు గుర్తించి వెంబడించే ప్రత్నం చేశారు. ఐతే కిడ్నాపర్లు ముందుకు,వెనక్కి వెళ్లడంతో సాధ్యపడలేదు. చివరికి పోలీసులకు విషయం తెలిసిందని భయపడిన కిడ్నాపర్లు... కావలి దగ్గర బాలుడిని కారులో నుంచి నెట్టేసి వెళ్లిపోయారు. పోలీసులు... రాజీవ్‌సాయిని చిలకలూరిపేటకు తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కిడ్నాపర్లు కారులో చాలా దూరం తిప్పారని రాజీవ్‌సాయి చెప్పాడు. బిడ్డను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు. బాలుడిని రక్షించిన పోలీసులను మంత్రి విడదల రజని అభినందించి సన్మానించారు.
ఇవీ చదవండి: