తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్‌మాల్ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారింది. ముమ్మర దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎనిమిది మందిని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరు విచారణకు సహకరించట్లేదు. ఈ నాలుగు రోజుల విచారణలో.. నిందితులు నోరుమెదపలేదు. నిందితులు కాజేసిన రూ.64 కోట్లు ఏం చేశారనేది ఇంకా వెల్లడి కాలేదు. డిపాజిట్ల మళ్లింపు, వాటాల పంపకంపై ఇప్పటికీ పూర్తి సమాచారం లభించలేదు. ఈ కేసులో పూర్తి వివరాలు సేకరించేందుకు నిందితులను మరో 4 రోజులు కస్టడీకి తీసుకుంటామని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. కస్టడీ పొడిగింపుపై నేడు నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
సోమవారం రోజున పోలీసుల ప్రశ్నలకు నిందితులు వింత సమాధానాలిచ్చినట్టు తెలిసింది. కరోనా కారణంగా ఖర్చులు పెరగటంతో భారీగా అప్పులు చేశామని, వాటిని తీర్చేందుకు ఈ మార్గం ఎంచుకున్నామని నిందితుల్లోని కొందరు వివరించినట్టు సమాచారం. వారు కావాలనే వాస్తవాలు దాస్తున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ కుంభకోణం వెనుక మరో నలుగురి ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి :