kadiri murder case: కదిరిలో ఉపాధ్యాయురాలిని హత్య చేసి బంగారు ఆభరణాలను అపహరించిన కేసు వ్యవహారం నాలుగు నెలల తర్వాత కొలిక్కి వచ్చింది. బెంగళూరుకి చెందిన లారీ డ్రైవర్‌ను ఈ కేసులో కీలక నిందితుడిగా భావించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది
గతేడాది నవంబర్ 16న అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఎన్జీవోకాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ టీచర్ ఉషారాణి తలపై రాడ్ తో మోది హత్య చేశారు. సుమారు 50 తులాలకు పైగా బంగారు ఆభరణాలు ఎత్తు కెళ్ళారు. అలాగే పక్కింట్లోనే ఉన్న శివమ్మ అనే మహిళ పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
పోలీసులకు సవాలుగా
శాంతిభద్రతలకు సవాల్‌గా నిలిచిన ఈ ఘటనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదనపు ఎస్పీకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. 50 మంది అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసు శాఖ వివిధ కోణాల్లో కేసును అన్వేషించి నిందితుడిని పట్టుకున్నారు. అయితే, కర్ణాటకలో జరిగిన చోరీ కేసులో నిందితుడిగా అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. కర్ణాటక పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితుడు కదిరిలో హత్య దోపిడీ చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగస్వాములైన పోలీసు అధికారులు నిందితుడిని తమ అదుపులోకి తీసుకొని మరిన్ని ఆధారాలను రాబడుతున్నారు. త్వరలోనే ఈ కేసు చేధించి నిందితుడిని కటకటాలకు పంపుతామని పోలీసు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:కల్లూరులో దారుణం... మూడు నెలల పసికందును చంపి ఉరేసుకున్న తల్లి