మహాగనగరంలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి పోలీసులు సరికొత్త అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనరేట్ల పరిధిలో హత్యలు, హత్యాయత్నాలకు ప్రధాన కారణమవుతున్న రౌడీషీటర్లపై ప్రధానంగా దృష్టి సారించారు. కరుడుగట్టిన ఈ నేరగాళ్లను పీడీయాక్టు కింద జైళ్లకు పంపిస్తున్నారు. వారి అనుచరులపై కూడా ఉక్కుపాదం మోపడంతో సంబంధిత ప్రాంతాల్లో చాలా వరకు నేరాల సంఖ్య తగ్గుతోందని పోలీసులు చెబుతున్నారు. మహానగరంలో అనేక ఘటనలకు కారణమవుతున్న నేరగాళ్లను గుర్తించి పీడీయాక్టును అమలు చేసేందుకు తాజాగా పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
3వేల మంది రౌడీషీటర్లు..
నగరంలో గతేడాది అన్ని రకాలుగా 15,858 కేసులు నమోదు కాగా సైబరాబాద్ పరిధిలో 24,868 కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో కూడా 18 వేలకు పైగా కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం నేరాలు జరిగిన తీరును పోలీసులు విశ్లేషిస్తే 30 శాతానికిపైగా కేసుల్లో పాత నేరగాళ్ల పాత్రే ఉందని తేలింది. వీరిని అదుపు చేస్తే చాలా వరకు నేరాల సంఖ్య తగ్గుతుందన్న భావనకు పోలీసులు వచ్చారు. మూడు కమీషనరేట్ల పరిధిలో 3 వేల మందికిపైగా రౌడీషీటర్లు ఉన్నారు. ఐదారు నేరాల్లో ప్రమేయం ఉంటే వారిపై రౌడీషీటు తెరుస్తున్నారు. సంబంధిత కేసుల్లో పోలీసులు అరెస్టు చేసినా తరువాత బెయిల్ మీద వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు.
మొగ్గలోనే తుంచేయాలన్న ఉద్దేశంతో ..
నేరస్థులను మొగ్గలోనే తుంచేయాలన్న ఉద్దేశంతో మూడేళ్లుగా పీడీయాక్టును అమలు చేయడం మొదలుపెట్టారు. ఈచట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే ఏడాదిపాటు సంబంధిత నేరగాడికి బెయిల్ రాదు. జైలులో ఉండాల్సిందే. గతేడాది హైదరాబాద్ పరిధిలో 109 మంది సైబరాబాద్ పరిధిలో 83 మంది, రాచకొండ కమీషనరేట్ పరిధిలో 82 మందిపై పీడీయాక్టును నమోదు చేశారు. వీరి అనుచరుల కదలిలకపై దృష్టి సారించారు. గత మూడేళ్లలో 800 మందికిపైగా నేరగాళ్లపై పీడీ చట్టాన్ని అమలు చేశారు.