విరసం నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. కర్నూలులోని విరసం కార్యదర్శి పాణి ఇంట్లో (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పోలీసు బందోబస్తుతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన విరసం నాయకురాలు వరలక్ష్మి ఇంట్లోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ప్రొద్దుటూరులోని వరలక్ష్మి నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు. ఆరుగురు ఎన్ఐఏ అధికారులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి తలుపులు వేసి మరీ విచారణ చేస్తున్నారు. ఇంట్లో వరలక్ష్మితోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఇంటి బయట భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు కట్టడి చేశారు. విరసం నేత వరలక్ష్మి.. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
మరోవైపు విశాఖ పిఠాపురంకాలనీలో న్యాయవాది కె.పద్మ, చినవాల్తేరులోని న్యాయవాది కె.ఎస్.చలం ఇళ్లలోనూ.. ఎన్‌ఐఏ సోదాలు చేసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, తాడేపల్లిలో తనిఖీలు నిర్వహించింది. పౌరహక్కులు, ప్రగతిశీల మహిళా సంఘాల నేతల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. ఎన్ఐఏ సోదాలను పౌరహక్కుల సంఘాల నేతలు ఖండించారు.
హైదరాబాద్‌లో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ ఇంట్లోనూ... ఎన్‌ఐఏ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. సరూర్‌నగర్ పరిధి పీఎన్టీ కాలనీలోని ఆయన నివాసంలో సోదాలు చేశారు. రఘునాథ్ ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ను అధికారులు పరిశీలించారు.
గత ఏడాది నవంబరు 23న గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ 27 మందిలో వరలక్ష్మి ఉన్నారు. అదే రోజు విశాఖపట్నం జిల్లా మంచంగిపట్టు పోలీసులు కూడా 64 మందిపై కేసులు నమోదు చేశారు. వీరందరికీ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇటీవలే ఈ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఏకకాలంలో కేసులు నమోదైన వారందరి ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: