హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచార ఘటనపై పోలీసు విచారణ కొనసాగుతోంది. మరో బాధితురాలి ఆచూకీ ఇప్పటికీ దొరకకపోవడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వర్, సెక్యూరిటీ గార్డులను ప్రశ్నిస్తున్నారు. వారు ఎలాంటి వివరాలు చెప్పడం లేదని తెలిసింది. ఈ ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ మంగళవారం సమీక్షించారు. విచారణను వేగవంతం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని సీపీ అంజనీకుమార్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతపై సందేహాలు రేకెత్తుతున్నాయి.
- అత్యాచారానికి గురైన మహిళ అపస్మారక స్థితిలో ఉండడాన్ని ఆమె అక్క కుమారుడు గుర్తించే వరకు సెక్యూరిటీ గార్డులు కానీ, ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు కానీ ఎవరూ ఎందుకు గమనించలేదు?
- బాధితురాలిని చూసిన ఆమె అక్క కుమారుడు ఆసుపత్రి వర్గాలకు సమాచారం ఇవ్వకుండా నేరుగా సొంతూరు మహబూబ్‌నగర్‌కు ఎందుకు తీసుకెళ్లాడు?
- తన భార్య, మరదలు ఆసుపత్రిలో కనిపించకుండాపోగా కిడ్నీరోగి ఈనెల 12న ఆసుపత్రి వర్గాలకు చెప్పకుండానే కుమారుడితోపాటు మహబూబ్‌నగర్‌కు ఎలా వెళ్లిపోయాడు? సోమవారం బాధితురాలు పోలీసులకు చెప్పేంతవరకూ ఆసుపత్రివర్గాలు ఆ విషయాన్ని గుర్తించకపోవడమేమిటి? ఈ విషయాలపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు రోగి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. రెండోరోజు కూడా బాధితురాలు సరైన సమాచారం చెప్పకపోవడంతో సాంకేతిక ఆధారాలను అన్వేషిస్తున్నారు.
నిందితులకు కఠిన శిక్ష తప్పదు: సునీత
గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం కేసులో నిందితులను ఉపేక్షించేది లేదని, వారికి కఠిన శిక్ష తప్పదని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కమిషన్ సభ్యురాలు షబానా అఫ్రోజ్‌తో కలిసి ఆమె గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. బాధితురాలు దొరికిన ప్రదేశాన్ని పరిశీలించారు. సూపరింటెండెంట్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విచారణ వేగంగా జరుగుతోందని, వాస్తవాలన్నీ త్వరలోనే వెలుగుచూస్తాయని చెప్పారు. భరోసా కేంద్రానికి వెళ్లి బాధితురాలితో మాట్లాడతానన్నారు.
ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఆసుపత్రిని సందర్శించారు. సూపరింటెండెంట్ రాజారావు, పోలీస్ అధికారులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ప్రగతిశీల మహిళాసంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య ఈ సందర్భంగా ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇందుకోసమేనా? అంటూ నిలదీశారు. మహిళా సంఘాల తరఫున ఐదుగురు ప్రతినిధులం నిజనిర్ధారణకు వస్తే పోలీసులు అడ్డుకుని బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించారంటూ మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందిస్తూ.. నిజనిర్ధారణకు వచ్చిన వారిని అడ్డుకోవద్దని సూపరింటెండెంట్ రాజారావుకు సూచించారు. సీపీఎం, జైభీమ్‌సేనలకు చెందిన ప్రతినిధులు కూడా ఆసుపత్రితోపాటు, చిలకలగూడ ఠాణా వద్ద ఆందోళన చేపట్టారు.
ఇవీచూడండి: Speed Cameras in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో స్పీడ్ కెమెరాలు!