రుణయాప్ నిర్వాహకులకు చెందిన ఖాతాల్లో నుంచి నగదును అక్రమంగా బదిలీ చేసిన ఘటనలో తెరవెనక పెద్ద కుట్రే జరిగినట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నగదు బదిలీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. దీని వెనక ఇంకెవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ అనే వ్యక్తి నకిలీ ఎస్సైగా అవతారమెత్తి కోల్‌కతా ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న కోటి 18లక్షల నగదును బేగంపేటకు చెందిన ఆనంద్ ఖాతాలో జమ చేశాడు. దీనికి గాను ఆనంద్‌కు లక్షా యాభై వేల రూపాయలిచ్చారు. అక్కడి నుంచి ఆ నగదు పలు ఖాతాల్లోకి చేరింది.
రుణయాప్‌ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 1100కు పైగా ఖాతాలను స్తంభింపజేసి అందులో ఉన్న రూ.302 కోట్ల నగదు లావాదేవీలను నిలిపివేశారు. ఈ డబ్బును ఎలాగైనా బదిలీ చేసుకోవాలనే ఉద్దేశంతో రుణయాప్ నిర్వాహకులు సైబర్ నేరస్థుడు అనిల్‌తో ఒప్పందం కుదుర్చుకొని తతంగం నడిపించినట్లు పోలీసులు తేల్చారు. ఏప్రిల్ నెలలో అనిల్‌తో 25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని... విమానంలో వెళ్లేందుకు ఆయన ఖాతాలో రూ.20వేలు వేసినట్లు గుర్తించారు. ఏప్రిల్ నాలుగో వారంలో కోల్‌కతాకు వెళ్లిన అనిల్ బ్యాంకులో ఉన్న కోటి 18లక్షలను ఆనంద్ ఖాతాలో జమ చేశాడు. అనిల్‌కు సూచనలిచ్చిన వ్యక్తి ఎవరనేది తెలుసుకోవడానికి సైబర్ క్రైం పోలీసులు దిల్లీ వెళ్లారు. అతనిని పట్టుకుంటే కేసులో కీలక సమాచారం లభించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: