Amberpet Narayana College Update: హైదరాబాద్‌లోని అంబర్‌పేట నారాయణ కళాశాలలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనలో ఇవాళ ఓ వ్యక్తి మృతి చెందాడు. కంచన్‌బాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో కళాశాల ఏవో అశోక్‌రెడ్డి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థి నేత సందీప్ పరిస్థితి విషమంగా ఉందని.. మరో విద్యార్థి వెంకటాచారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసలేం జరిగిందంటే..హైదరాబాద్ అంబర్‌పేటలోని ప్రైవేటు కళాశాలలో విద్యార్థి నాయకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సాయి నారాయణ అనే విద్యార్థి సదరు కళాశాలలో జూన్‌లో ఇంటర్ పూర్తి చేశాడు. కళాశాలకు రూ.16 వేల ఫీజు కట్టాల్సి ఉండగా.. మొత్తం చెల్లిస్తేనే టీసీ ఇస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో సాయి నారాయణ కళాశాలకు వెళ్లాడు. ఫీజు చెల్లించలేదని, టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. అతనితో పాటు విద్యార్థి నాయకుడు సందీప్, మరికొందరిని తీసుకెళ్లాడు. ఫీజు బకాయిలు ఉండటంతో టీసీ ఇవ్వడానికి కళాశాల సిబ్బంది నిరాకరించారు.
ఇదే విషయంపై సందీప్, ప్రిన్సిపల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఫీజు విషయం, టీసీ గురించి మాట్లాడుతుండగా సందీప్ ప్రిన్సిపల్‌ను బెదిరించేందుకు తనతో తీసుకొచ్చిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. కృష్ణాష్టమి వేళ వెలిగించిన దీపం పక్కనే ఉండటంతో మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డి, ఏవో అశోక్‌రెడ్డి గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రిన్సిపల్ గదిలో మంటలు అంటుకుని ఏసీతో పాటు అక్కడి సామగ్రి కాలిపోయాయి. కుర్చీలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: