Fire Accident: నిలిపి ఉంచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించిన ఘటన గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడవల్లి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక పరిశ్రమల సముదాయం వద్ద విజయవాడ వైపునకు వెళ్లే మార్గానికి సమీపంలోని ఖాళీ స్థలంలో కొంతకాలంగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును పార్క్ చేశారు. ఉన్నట్లుండి శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో హైవేపై వాహనదారులు, పరిసరాల్లో పనిచేసే కార్మికులు అప్రమత్తమై పరుగులు తీశారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న గన్నవరం అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వాహనాలు తరలించడంలో జాప్యం..: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై రామవరప్పాడు నుంచి తేలప్రోలు మధ్య నిత్యం ప్రమాదాలు ఏదోమూలన జరుగుతూనే ఉంటాయి. అందులో గూడవల్లి-కేసరపల్లి మధ్య ఈ పరిస్థితి అధికం. ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు సహాయక చర్యలు సకాలంలో అందడమే కష్టంగా మారడం ఓ ఎత్తు అంటే.. ప్రమాదానికి కారణమైన వాహనాలను సకాలంలో తరలించకపోవడంలో జరిగే జాప్యంతో చోటు చేసుకునే ప్రమాదాలు మరో ఎత్తు. ఇప్పటికైనా ప్రమాదానికి కారణమైన వాహనాల తరలింపులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్థానిక పరిశ్రమల ప్రతినిధులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఇంటర్ బోర్డులో నిధులు మాయం.. కేసు సీఐడికి అప్పగించే యోచన