Secunderabad Fire Accident Update: తెలంగాణలో అగ్నిప్రమాదానికి గురైన దక్కన్ మాల్ ఏ క్షణమైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉండటంతో, చుట్టుపక్కల ఉన్న వారికి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజులుగా మంటల్లో ఉన్న భవన సముదాయంలోని శ్లాబులు ఒక్కొక్కటిగా పెచ్చులూడుతూ వచ్చాయి. నిన్న 1, 2, 3 అంతస్తుల వరకూ శ్లాబులు కూలి సెల్లార్లో పడిపోయాయి.
ఈ ప్రాంతంలో మంటలు ఎక్కువగా రావడం వల్లే స్టాల్ పూర్తిగా బలహీన పడి కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. భవనం క్రమంగా బలహీనపడి కుప్పకూలే ప్రమాదం ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. భవనం చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేసిన కుటుంబాలను ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. ప్రమాదంలో చిక్కి గల్లంతైన ముగ్గురిలో శనివారం ఒకరి ఎముకల అవశేషాలు సేకరించి డీఎన్ఏ పరీక్షకు పంపారు.
Deccan Mall is in Danger of Collapsing: మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించటం పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారింది. పోలీసులు, అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది భవనం మొత్తం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. శనివారం లభించిన ఒకరి అవశేషాలు మొదటి అంతస్తులో లిఫ్ట్ మెట్ల మార్గం వద్ద లభించాయి. అదేచోట శ్లాబులు కూలిపోవటంతో కనిపించకుండా పోయిన ఇద్దరి ఆనవాళ్లు శిథిలాల కింద ఉండిపోవచ్చని అగ్నిమాపకశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తమ వారి గురించే ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితుల బంధువుల్లో ఆందోళన నెలకొంది. నాలుగంతస్తుల శ్లాబులు కూలటంతో పెద్ద ఎత్తున శిథిలాలు ఏర్పడ్డాయి. వీటిని మనుషులతో తొలగించడం అసాధ్యమని అధికారులు అంచనాకు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో జేసీబీ లాంటివి తీసుకుని వెళ్లి శిథిలాలను తొలగించడం కూడా సాధ్యపడే పని కాదని, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం లాంటిదేనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
భవనంలో ఆరు అంతస్తులుండగా కేవలం నాలుగు అంతస్తులు మాత్రమే పూర్తిగా కాలిపోయాయి. మిగతా రెండు అంతస్తుల్లోని వస్తువులు ఏమాత్రం కాలిపోకుండా ఉండటం చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మైనస్- 2 సెల్లార్లో ఉన్న గోదాం, దక్కన్ సామగ్రి కూడా కాలిపోకుండా అలాగే ఉన్నాయి. సెల్లార్, మొదటి, రెండవ, మూడవ అంతస్తుల్లో మాత్రమే సామాగ్రి మొత్తం కాలిపోయింది. అందుకే ఈ ఫ్లోర్లలో ఉండే శ్లాబులు కూలిపోయాయి. 4, 5, 6 అంతస్తుల్లో భవనంలోకి కేవలం పొగ మాత్రమే చేరటంతో వస్తువులు కొద్దిగా దెబ్బతిన్నాయి. అందులో ఉండే కొంత సామగ్రి చెక్కుచెదరకుండా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి: