Fake Call Frauds : అత్యవసరంగా కూకట్‌పల్లి వెళ్తున్న నవీన్ జేబులో ఫోన్ రింగైంది. ఫోన్ ఎత్తి ఎవరని అడగ్గా.. ‘సర్.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. వ్యక్తిగత రుణం కావాలా?’ అని అడిగారు. నవీన్ సున్నితంగా తిరస్కరించారు. మరుసటి రోజు వేరే నంబరు నుంచి ఫోన్ చేసి రుసుముల్లేకుండా క్రెడిట్ కార్డు జారీ చేస్తామని చెప్పారు. మరో రోజు ‘మీరు బహుమతి గెలుచుకున్నారు.. మా సంస్థ కార్యాలయానికి వచ్చి తీసుకెళ్లొచ్చు’ అంటూ ఫోన్. నంబరు ఎక్కడా ఇవ్వకున్నా ఇలాంటి కాల్స్ ఎందుకొస్తున్నాయన్నది నవీన్ అంతర్మథనం. ఇది అతనొక్కడి సమస్యే కాదు.. భాగ్యనగరంలో కొన్నివేల మందికి నిత్యకృత్యం.
Cyber Crime Fake Call Frauds : మార్కెటింగ్ ప్రమోషన్స్ పేరిట వస్తున్న కాల్స్ బెంబేలెత్తిస్తున్నాయి. వ్యక్తిగత రుణం, క్రెడిట్‌కార్డు ఇస్తామనో... లేక తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు ఉన్నాయని, కొనుగోలు చేయాలంటూ ఫోన్లు వస్తున్నాయి. ఇవి ఒకెత్తయితే బహుమతి గెలుచుకున్నారంటూ నమ్మబలికి మోసాలకు పాల్పడుతుండడం మరోఎత్తు. గృహిణులు, వృద్ధులకూ ఈ బెడద తప్పడం. వీటికి తోడు తమ ఉత్పత్తులు కొనుగోలు చేయాలంటూ వెబ్‌సైట్ లింకులతో సందేశాలు, ఈ మెయిళ్లు పంపుతున్నారు.
టెలీకాం సంస్థల నుంచి సేకరణ
Fake Bank Calls : బ్యాంకులు డెబిట్, క్రెడిట్‌కార్డుల, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల నిర్వహణ పొరుగుసేవల సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఆయా సంస్థలు వినియోగదారుల నంబర్లను ఇతరులకు విక్రయిస్తున్నాయి. కొందరు నేరుగా సెల్‌ఫోన్ నెట్‌వర్క్ సంస్థల నుంచే సేకరిస్తున్నారు. నిరుద్యోగుల వివరాలు నమోదు చేసుకునే జాబ్‌పోర్టళ్ల నుంచి వంద లేదా వెయ్యి నంబర్లకు కొంత మొత్తం చెల్లించి తీసుకుంటున్నారు. నంబర్లు సేకరిస్తున్న కొందరు వీటిని మోసపూరిత కార్యక్రమాలకు వాడుకుంటున్నారు.
అక్కడ నమోదు చేస్తే అందరికీ..
Cyber Crimes Today : వివిధ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యత ఇతర వివరాల్ని తెలుసుకొనేందుకు తయారీ సంస్థల వెబ్‌సైట్లు సందర్శిస్తుంటాం. ఈ సందర్భంగా కొన్ని సంస్థలు ఫోన్‌నంబర్లు, మెయిల్ ఐడీలు నమోదు చేయాలని కోరుతుంటాయి. తర్వాత ఆయా సంస్థల ప్రతినిధుల నుంచి కాల్స్ వస్తుంటాయి. అవే ఉత్పత్తులు విక్రయించే ఇతర సంస్థల నుంచీ ఫోన్లు రావడం పెద్ద సమస్యగా మారుతోంది.
పెట్రోలు బంకులు, మాల్స్ వెలుపల కొందరు వ్యక్తులు ఆఫర్లతో కూడిన కరపత్రాలు పంచుతారు. పేరు, ఫోన్ నంబరు నమోదు చేస్తే.. లక్కీడ్రా తీసి విజేతను ప్రకటిస్తామంటూ వివరాలు సేకరిస్తుంటారు. ఇలా తీసుకున్న వివరాల్ని మార్కెటింగ్ సంస్థలకు ఇస్తున్నారు.
కరోనా నేపథ్యంలో కొన్ని షాపింగ్‌మాళ్లు వినియోగదారుల ఫోన్ నంబర్లు నమోదు చేసుకుంటున్నాయి. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ట్రాకింగ్ సులువుగా ఉంటుందని సేకరించాయి. ఇలా ఇచ్చిన నంబర్లను ఇతర సంస్థలకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.