Auto collided with a parked lorry: ఏలూరు జిల్లాకు చెందిన 13 మంది కళాకారులు.. ట్రాలీ ఆటోలో అనకాపల్లి జిల్లా కశింకోట పరమటమ్మ తల్లి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆటోకు ముందు వేగంగా వెళుతున్న లారీ.. కాకినాడ జిల్లా గండేపల్లి వద్ద ఒక్కసారిగా ఆగింది. వెనుకనే ఉన్న ట్రాలీ ఆటో.. అదే వేగంతో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో ముందుభాగం నుజ్జునుజ్జైంది. 13 మంది కళాకారుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారిలో కొందరికి తీవ్ర గాయాలవగా, మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
దొన్నపల్లి నుంచి రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరాము. గండేపల్లి వద్ద తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. మేము బతుకుతెరువు కోసం నాటకాలు వేసుకుంటున్నాం. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో మేము చాలా ఇబ్బందుల్లో పడ్డాము. ప్రభుత్వం మమ్మల్ని, మా కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము.-క్షతగ్రాతులు
తీవ్రంగా గాయపడిన వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా... మార్గం మధ్యలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన కళాకారులు మంగ, ప్రసాద్, మహేశ్, ట్రాలీ ఆటో డ్రైవర్ కొండగా గుర్తించారు. స్వల్ప గాయాలైన కళాకారులకు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇవీ చదవండి