దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 2 లక్షల 43 వేల 500 తో పాటు 200 యూఎస్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్‌లోని బాలుగ్రామ్కు చెందిన అనిల్‌ఉల్ షేక్, షాజహాన్ షేక్, వాహబ్ షేక్ కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ప్రజల దృష్టి మళ్లించి నేరాలకు పాల్పడటానికి పథకం వేశారు.
ఎంచుకున్న నగరాలకు చేరుకుంటారు. తక్కువ అద్దె ఉండే ప్రాంతాల్లో ఇల్లు చూసుకుని దిగుతారు. తమ వద్ద యూఎస్ డాలర్లు ఉన్నాయంటూ పలువురిని మాటలతో నమ్మిస్తారు. వాటిని మార్పిడి చేయాలని చెప్పి ముందువైపు రెండు అసలు యూఎస్ డాలర్లను ఉంచి.. మిగతావి సబ్బు కాగితాలను పెడతారు. అన్ని నిజమైన డాలర్లుగా నమ్మించి మార్పిడి చేస్తారు. డాలర్లకు బదులు భారత్ కరెన్సీ నోట్లు తీసుకుని.. బాధితుల దృష్టి మళ్లించి పరారవుతారు.
పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ముఠాలోని ఓ వ్యక్తి పరారు కాగా... అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.