తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా తారాపల్లికి చెందిన అవుషోడపు సుధాకర్ హైదరాబాద్ శివారు కాప్రాలో నివాసం ఉంటున్నాడు. ఐదో తరగతి వరకు చదువుకున్న.. సుధాకర్.. హైదరాబాద్‌కు వచ్చి స్థిరాస్తి వ్యాపారంలోకి దిగాడు. విలాసాలకు అలవాటు పడి.. మొదట చిన్నచిన్న మోసాలకు తెరతీశాడు. ఆ తర్వాత నాగరాజు, భీమయ్యలతో కలిసి సీఎం ఓఎస్డీగా అవతారమెత్తాడు. డ్రైవర్, బాడీగార్డులను వెంటబెట్టుకుని ఖరీదైన కారులో తిరుగుతూ ప్రజలను మోసం చేయడం మొదలెట్టాడు. ఉద్యోగాలు, ప్రభుత్వ స్థలాలు, రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తానని.. డబ్బులు వసూలు చేశాడు. దేవాలయాల వద్ద వీరు ఆర్భాటాలు ప్రదర్శించి.. అమాయక ప్రజల అవసరాలను గ్రహించి మోసాలు చేస్తారు.
సీఎంతో చెప్పి ఎకరం ఇప్పిస్తానని..
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్లిన సుధాకర్... చిన్న కార్యాలయంలో ఎలా ఉంటారు.. సీఎంతో చెప్పి సికింద్రాబాద్‌లో ఎకరం స్థలం ఇప్పిస్తానంటూ రూ.25 లక్షలు కాజేశాడు. తర్వాత సుధాకర్ స్పందించకపోవడం వల్ల.. సదరు జ్యోతిష్కుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తక్కువ రేటుకే బంగారం ఇప్పిస్తా..
లోహ విగ్రహాల వ్యాపారికి తక్కువ రేటుకే బంగారం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు గుంజాడు. మోసపోయిన బాధితుడు మహంకాళి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని రూ.25 లక్షలు కాజేశాడు. వరుస నేరాలపై ఫిర్యాదులు రావడంతో.. నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సుధాకర్ సహా అతడికి సహాయకులుగా ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కోటి రూపాయల నగదు, ధ్రువపత్రాలు, ఫార్చునర్ కారు, స్టాంపు, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మరో వైపు రబ్బరు స్టాంపులు తయారీదారులు... ధ్రువపత్రాలు పరిశీలించిన తర్వాతే స్టాంపులు తయారు చేయాలని.. లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.