12 illegal weapons seized in Anantapur district: అనంతపురం జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న వ్యక్తులను పట్టుకుని విచారిస్తే, అక్రమ ఆయుధాల కేసు వెలుగులోకి వచ్చిందని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప మీడియాకు తెలిపారు. అనంతపురం జిల్లా పోలీసులను కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌లుగా ఏర్పాటు చేసి, కేసును లోతుగా దర్యాప్తు చేపట్టగా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు.
బెంగళూరుకు చెందిన రౌడీషీటర్లు జంషీద్, ముబారక్, అమీర్ పాషా, రియల్ అబ్దుల్ షేక్‌లు.. మహారాష్ట్రలోని సిర్పూర్ నుంచి గంజాయి, మధ్యప్రదేశ్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందిందన్నారు. అప్రమత్తమైన పోలీసులు వారి నుంచి 12 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. స్పెషల్ టీమ్ వారిని విచారించి మరింత కీలక సమాచారాన్ని రాబట్టిందన్నారు. అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వానీ జిల్లా డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఆయుధాల తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారన్నారు.
ఆ దాడిలో ఆయుధాల తయారీదారుడు, డీలర్ రాజాతోపాటు ఆయుధాల సరఫరాదారుడిగా ఉన్న సుతార్ను అరెస్ట్ చేసి, వారి నుంచి 6 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయుధాల డీలర్ల నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలతో బెంగళూరుకు చెందిన ముఠా సభ్యులు.. కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నట్టు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ కేసులో మరింత దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసుకు రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు.
మొదటగా నవంబర్ 10న అనంతపురం జిల్లా స్పెషల్ పోలీసులను ఓ సమాచారం వచ్చింది. బళ్లారి-అనంతపురం జిల్లాల మధ్య నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు సమాచారం అందింది. దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నాం. ఆ తర్వాత నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నాం. వారిని విచారిస్తుండగా ఈ అక్రమ ఆయుధాల కేసు వెలుగులోకి వచ్చింది.-అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప
ఇవీ చదవండి