Student Suicide in palamaner: చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తనతో... తన బిడ్డ ప్రాణాలు కోల్పోయిందంటూ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఉపాధ్యాయున్ని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పలమనేరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని... తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధరించారు.
పదో తరగతి చదువుతున్న తన కుమార్తె సరిగా చదవడం లేదంటూ మూడు రోజుల కిందట ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేశ్ చెప్పారని.. విద్యార్థిని తండ్రి వెల్లడించారు. మరో పాఠశాలలో చేర్చుకోవాలనడంతో... తాను అలానే చేసినట్లు తెలిపారు. తన బిడ్డ అక్కడా చదువడం లేదని... బడికి వచ్చినా ముభావంగా ఉందన్న కారణంతో... ఇంటికి తీసుకెళ్లాలని కొత్త పాఠశాల యాజమాన్యం తెలియజేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా... రమేశ్ అనుచితంగా వ్యవహరించినట్లు తన కూతురు ఏడుస్తూ చెప్పినట్లు బాలిక తండ్రి వాపోయారు. ఇంటికి వచ్చాక దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పి... గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని విలపించారు. తన కూతురు చావుకు పాఠశాలతో పాటు అక్కడి ఉపాధ్యాయుడూ కారణమంటూ... కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... బాలిక ఆత్మహత్యకు వేధింపులా లేక చదువు ఒత్తిడా అనే అంశంపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Priest Murder: పశ్చిమగోదావరి జిల్లాలో పూజారి దారుణ హత్య