Latest Trends in Cybercrime: మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాలను వాడుతున్నారా..? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ మధ్యమధ్యలో వచ్చే ప్రకటనలతో.. లేదంటే అమ్మాయిల నగ్న వీడియోలతో వల పన్ని.. ఉచ్చులో చిక్కుకునేలా చేస్తుంటారు కేటుగాళ్లు. వాట్సప్ నెంబరుకు ఫోన్ చేసి.. కేవలం 4 నుంచి 5 సెకన్లలో నగ్నంగా కనిపించి మాయమవుతారు. వీడియో చూసే దృశ్యాలను రికార్డ్ చేసి మళ్లీ వారికే పంపి.. డబ్బులివ్వమంటూ బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. అడిగినంత ఇవ్వకుంటే అంతర్జాలంలో ఉంచుతామని బెదిరిస్తారు. ప్రముఖ కంపెనీల్లో షేర్లు కొంటే నాలుగైదు రెట్లు లాభాలు వస్తాయంటూ నమ్మించి.. నిలువునా దోపిడీ చేస్తుంటారు. ముఖ్యంగా యువతీ యువకులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్నారు.
14 వేలకే ఐఫోన్ అని 75 వేల టోకరా..
ఇటీవల హైదరాబాద్లోని ఎల్బీనగర్‌కు చెందిన ఓ విద్యార్థిని సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. ఇన్‌స్టాగ్రాం చూస్తుండగా... 'ఐ ఫోన్-13' కేవలం 14 వేల రూపాయలకే నంటూ ప్రకటన వచ్చింది. ఖరీదైన ఫోన్ తక్కువకే వస్తుందనే ఆశతో ఆన్‌లైన్ ద్వారా ఆమె నగదు చెల్లించింది. మరికొంత కావాలంటూ 75 వేల రూపాయల వరకు దండుకున్నారు. వనస్థలిపురానికి చెందిన ఓ గృహిణి.. తక్కువ పెట్టుబడితో రోజువారీ ఆదాయం అనే ప్రకటన చూసి.. వాటికి ఆకర్షితురాలైంది.
క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్స్‌లో డబ్బుపెడితే పెద్దఎత్తున లాభాలు వస్తాయంటూ దఫాలవారీగా లక్ష రూపాయలు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. బాధితురాలు సకాలంలో పోలీసులను ఆశ్రయించటంతో మోసగాళ్ల బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. ఇలా కొత్త ఏడాదిలో వారం రోజుల వ్యవధిలోనే నగరంలో 10 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆన్‌లైన్‌లో మోసాలకు గురై తంటాలు పడటం కంటే ముందుగానే అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశముండదని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: online trading cyber crime : ఆన్‌లైన్ ట్రేడింగ్.. నిండామునిగిన హైదరాబాద్ మహిళ!