ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోమమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు చేపట్టిన మహా నిరసన కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని విజయసాయి డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందన్నారు. దీని వెనుక ఎంతో చరిత్ర దాగి ఉందని వ్యాఖ్యానించారు.
"1991లో ఉత్పత్తి మొదలు పెట్టారు. ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా అవతరించింది. 15వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 17వేల మంది కాంట్రాక్ ఉద్యోగులు.. 70వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రైవేటీకరించేందుకు మనం ఒప్పుకోకూడదు. రాజకీయాలకు అతీతంగా, మన గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు మనమంతా పోరాటం చేయాలి. ఈ విషయంలో మీతో పాటు మేమూ కలిసి నడుస్తాం. పోరాటం సాగిస్తాం. కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఇప్పటికీ నెలకు రూ.200 కోట్ల లాభంతో ఉక్కు కర్మాగారం నడుస్తోంది. నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరణ చేయటం భాజపా ప్రభుత్వం విధివిధానాల్లో ఒకటి. కానీ, విశాఖ ఉక్కు లాభాల్లో నడుస్తోంది. మధ్యలో కొన్ని సంవత్సరాలు నష్టాలు వచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన సంస్థను ప్రైవేటీకరించడం తగదు" -ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖ ఉక్కు కోసం అనేక గ్రామాల ప్రజలు భూములు త్యాగం చేశారని వైకాపా ఎంపీలు విజయసాయి, మిథున్ రెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు ప్రస్తుత పరిస్థితి చూసి కేంద్రం పునరాలోచన చేయాలన్నారు. కేంద్రం దురుద్దేశంతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని ఎంపీలు మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. వైకాపా ఎంపీలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల పోరాటం కొనసాగుతుందన్నారు. ఏపీలో భాజపా ఉనికి లేదన్న కారణంగా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు నష్టం జరగకుండా సీఎం జగన్ అండగా ఉంటారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల భాటలోకి తెచ్చేందుకు ఉన్న మార్గాలను సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకు వచ్చారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకని..దాన్ని ప్రైవేటీకరణ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరగుతున్న పోరాటానికి పార్లమెంట్ లోపల, బయట మద్దతు ఇస్తామన్నారు.
హస్తినకు చేరిన పోరాటం
విశాఖ ఉక్కు నినాదం దేశ రాజధానికి చేరింది. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా నిరసన చేపట్టిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు, కార్మిక సంఘాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నారు. అధికార, ప్రతిపక్షాల నేతలు కార్మిక సంఘాలకు సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు. కేంద్రం దిగివచ్చే వరకూ తమ నిరసనలు ఉద్ధృతంగా సాగుతూనే ఉంటాయని తేల్చిచెప్పారు. కేంద్రం మోసపూరిత మాటలను కట్టిపెట్టి..విశాఖ ఉక్కు కర్మాగారంపై వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి
VISAKHA STEEL PROTEST IN DELHI : దిల్లీ జంతర్‌మంతర్ వద్ద విశాఖ ఉక్కు కార్మికుల మహా నిరసనలు