విశాఖకు చెందిన శ్రీధర్... మెకానికల్ ఇంజనీర్. ఇతను ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకత చాటుతున్నారు. గతంలో తాను తయారుచేసిన 3 చక్రాల ప్రత్యేక వాహనం అందరి దృష్టినీ ఆకర్షించింది. పిల్లల కోసం సరదాగా వినూత్నంగా ఉండే బ్యాటరీ సైకిల్‌నూ సృష్టించారు. వృత్తిపరంగా ఆటోనగర్‌లో టీమ్ పవర్ ఇంజినీరింగ్ పనులు నిర్వహిస్తున్న శ్రీధర్... పనిలో ప్రత్యేకతకు పెద్దపీట వేస్తున్నారు. శ్రీధర్ పరిశ్రమలో కొన్ని యంత్రాలు పూర్తిగా ఆయన తయారు చేసినవే దర్శనమిస్తాయి. అది కూడా తుక్కు నుంచి సేకరించిన వాటిని ఉపయోగించి తయారుచేసిన యంత్రాలు కావడం విశేషం.
పైప్ బెండింగ్ మెషీన్లు వంటివి మార్కెట్‌లో కొనుగోలు చేయాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడి వర్క్ షాప్‌లో పనిచేస్తున్న పైప్ బెండింగ్ మెషీన్ కేవలం 2 లక్షలకు తయారైంది. పనిలో వైవిధ్యాన్ని చూపించే మెళకువలు అనేక కళాశాలల దృష్టిని సైతం ఆకట్టుకున్నాయి. ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు కార్ట్‌లు తయారు చేయాలంటే శ్రీధర్ పర్యవేక్షణ తప్పనిసరి ఉంటుంది.
మెకానికల్ పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలపై మంచి పట్టున్న శ్రీధర్...ఎక్కువగా యువతకు స్ఫూర్తిని కలిగించే అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కొవిడ్ కారణంగా అనేకచోట్ల ఉద్యోగ అవకాశాలపై పడిన ప్రభావంతో యువత నిరుత్సాహపడవద్దని సూచిస్తున్నారు. కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు చేయాలన్న ఉత్సాహాన్ని కొనసాగిస్తే అద్భుతాలు చేయవచ్చని సూచిస్తున్నారు. తన పరిశ్రమలో 9వ తరగతి చదువుతున్న తన కుమార్తెకు వివిధ అంశాలపై అవగాహన కల్పించి ప్రస్తుతం రోజువారీ పనిలో కంప్యూటర్ ద్వారా మెషీన్లను కంట్రోల్ చేసే స్థాయికి ఆ అమ్మాయిని తీసుకువచ్చారు.
ఇంజినీరింగ్ నైపుణ్యం ఓ గొప్ప వరంగా చెబుతున్న శ్రీధర్... ఆ పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చంటున్నారు. యువత సరికొత్త ఉత్సాహంతో స్ఫూర్తి కలిగించే ప్రయత్నాలు చేయాలని శ్రీధర్ సూచిస్తున్నారు.
ఇదీచదవండి